ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో మరో కీలక ప్రక్రియ పూర్తయింది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 24 మందికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శాఖలను కేటాయించారు. అయితే పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వంగలపూడి అనితకు హోం శాఖ కేటాయించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు జగన్ తమ హయాంలో మహిళలకే హోం శాఖ కేటాయించగా.. అదే బాటలో చంద్రబాబు కూడా మహిళకే హోం శాఖ కేటాయించడం విశేషం. ప్రస్తుత కేబినెట్లో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగలపూడి అనిత. పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికీ ఆమెను ఏరికోరి మంత్రివర్గంలోకి తీసుకున్న చంద్రబాబు.. ఏకంగా హోం శాఖ అప్పగించడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఉపాధ్యాయురాలి వృత్తి నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వంగలపూడి అనిత 2014లో నవ్యాంధ్రలో జరిగిన తొలి ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే 2019లో అధిష్ఠానం ఆమెను కొవ్వూరు నుంచి బరిలోకి దించగా ఓటమి పాలయ్యారు. పార్టీకి విధేయురాలిగా ముద్రపడిన ఆమె తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగానూ పనిచేసి వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఈ క్రమంలోనే వైపీసీ మద్దతుదారుల నుంచి విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. కొందరైతే ఆమె వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు.
అయితే వీటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్న అనిత.. తాజా ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి పోటీచేశారు. అధిష్ఠానం తనకు టిక్కెట్ కేటాయించిన వెంటనే జనసేన, బీజేపీ కేడర్‌ను కలుపుకొని ప్రచారాన్ని హోరెత్తించారు. ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి కంబాల జోగులుపై ఏకంగా 43,727 ఓట్ల తేడాతో గెలుపొంది చరిత్ర సృష్టించారు. ఆమె విధేయతను గుర్తించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గంలో ఆమెకు స్థానం కల్పించడంతో పాటు హోం శాఖ కేటాయించారు.
తనకు హోం శాఖ కేటాయించడంపై వంగలపూడి అనిత చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. ‘నాపై అపార నమ్మకంతో నన్ను హోమ్ మినిస్టర్‌గా నియమించి, నాకు అత్యున్నత బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గార్కి కృతజ్ఞతలు… వారు అప్పగించిన బాధ్యతలను దైవ కార్యంగా భావించి అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించి, వారు నాపై పెట్టుకొన్న నమ్మకాన్ని నిలబెట్టుకొంటాను అని ఈ సందర్బంగా తెలియజేస్తున్నాను… అంటూ సోషల్‌మీడియా ద్వారా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు.