ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ బాస్ నారా చంద్రబాబునాయుడు తన ప్రసంగాల సరళి మార్చారు. గతానికి భిన్నంగా ఢీ అంటే ఢీ అంటూ మాటలతో మంటలు రేపుతున్నారు. సీఎం జగన్ డైలాగులను అదే ఊపుతో తిప్పికొడుతూ పంచ్‌లతో ఎదురు దాడి చేస్తున్నారు. ఈలలు, కేకలతో సభా ప్రాంగణం మోతెక్కేలా చేస్తున్నారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు గతంలో తన ప్రసంగాల్లో పంచ్ డైలాగులకు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. తాను అనుకొన్న విషయాన్ని జనానికి అర్థమయ్యేలా చెప్పాలని తాపత్రయపడేవారు. దీంతో ఆయన ప్రసంగాలు సుదీర్ఘంగా ఉంటూ కార్యకర్తలకు బోర్ కొట్టేసేవి. అయితే ఈసారి ఎన్నికల ప్రసంగాల్లో ఆయన తన స్టైల్ పూర్తిగా మార్చేశారు. అంకెలు.. లెక్కలు వదిలేసి సూటిగా సుత్తిలేకుండా ప్రత్యర్థులపై పంచ్ వేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.
– ఈ తాడేపల్లిగూడెం సభ చూసి తాడేపల్లి ప్యాలస్ కంపించిపోతుంది..
– మేము చేతులు మా కోసం కాదు, మా పార్టీల అధికారం కోసం కాదు .. మేము కలిసింది రాష్ట్రం కోసం, 5 కోట్ల ఆంధ్రుల భవిషత్తు కోసం.. #ChandrababuNaidu at #Jenda #TDPJanasena Public Meet. pic.twitter.com/1Ms6S4EUQe
— Gulte (@GulteOfficial) February 28, 2024
సీఎం జగన్ ఎంతో కసరత్తు చేసి తన ప్రసంగాల్లో వాడుతున్న డైలాగులపై చంద్రబాబు వెంటనే మాటల తూటాలు పేలుస్తున్నారు. ఉదాహరణకు తమ తొలి ఎన్నికల సన్నాహక సభ భీమిలి బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ, పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి తాను అభిమన్యుడిని కానని… అర్జునుడినని వ్యాఖ్యానించారు. దీనిపై పీలేరు సభలో చంద్రబాబు వెంటనే కౌంటర్ వేశారు. ‘అయ్యా పురాణ పురుషా… నువ్వు అభిమన్యుడివి కాదు. ఆయన తండ్రి అర్జునుడివి కాదు. నువ్వు ఈ రాష్ట్రం పాలిట భస్మాసురుడివి. నీకు వేరే పద్మవ్యూహాలు అక్కర్లేదు. నీ నెత్తిన నువ్వు పెట్టుకొంటున్న చెయ్యి చాలు’ అంటూ చంద్రబాబు ఇచ్చిన కౌంటర్ బాగా పేలింది. జగన్ తాను ఎప్పుడు అర్జునుడినని చెప్పుకొన్నా ఆయన భస్మాసురుడని జవాబు ఇవ్వడానికి టీడీపీ నేతలు సిద్ధమైపోయారు.
జగన్ తరచూ తన సభల్లో ప్రజలను ఉద్దేశించి…‘నేను మీ బిడ్డను’ అని పదేపదే వ్యాఖ్యానిస్తుంటారు. ‘జగన్ మీబిడ్డ కాదు…కేన్సర్ గడ్డ’ అని చంద్రబాబు కూడా ప్రతి సభలో ఎదురు దాడి చేస్తున్నారు. కేన్సర్ గడ్డ మాదిరిగా వివిధ వర్గాల ప్రజల జీవితాలను జగన్ ఎలా అతలాకుతలం చేస్తున్నారో కూడా ఉదాహరణలు ఇస్తున్నారు. భీమిలి సభ సమయంలో ‘సిద్ధం’ అనే ప్రచార వ్యూహాన్ని జగన్ శిబిరం ఎంచుకొని రాష్ట్రం అంతా అదే డైలాగుతో ఫ్లెక్సీలు పెట్టింది. భీమిలి సభలో కూడా దానినే హైలైట్ చేసింది. ఎన్నికల యుద్ధానికి తాము సిద్ధం అన్న ధీమాను వ్యక్తం చేయడానికి ఆ థీమ్‌ను ఆ పార్టీ వ్యూహకర్తలు ఎంచుకొన్నారు. దీనికి కూడా చంద్రబాబు తన సభల్లో కౌంటర్ ఇచ్చారు. ‘సై’ అన్న నినాదాన్ని ఆయన తనవైపు ఎంచుకొని వదిలారు. ‘నిన్ను పాతర వేయడానికి యువత, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, బాధిత వర్గాలన్నీ సిద్ధం. విజయపతాకం ఎగరవేసే విజయయాత్రకు మేం సై’ అని ఆయన ప్రకటించారు.
తెలుగుదేశం – జనసేన పొత్తు సూపర్ హిట్ 💥#TeluguJanaVijayam #AndhraPradesh pic.twitter.com/jiYyoMWb8Q
— iTDP Official (@iTDP_Official) February 28, 2024
వైఎస్ షర్మిల, పవన్ కల్యాణ్…. చంద్రబాబు తరపు స్టార్ క్యాంపెయినర్లని జగన్ చేసిన ఆరోపణపై కూడా చంద్రబాబు తేలిక పదాలతో ఎదురుదాడి చేస్తున్నారు. తమ ప్రభుత్వం తొంభై ఎనిమిది శాతం హామీలు అమలు చేసిందని, తమకు విశ్వసనీయత ఉందని తన సభల్లో జగన్మోహన రెడ్డి చేస్తున్న ప్రకటనలపై కూడా చంద్రబాబు పూర్తి స్థాయిలో సన్నద్ధమై ప్రచార సమరం చేస్తున్నారు. వివిధ అంశాలపై గతంలో జగన్ చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలను ఆయన తన సభల్లో వీడియో వేసి చూపిస్తున్నారు. పెద్ద తెరలపై వాటిని ప్రజల ముందు ప్రదర్శిస్తున్నారు.
బుధవారం తాడేపల్లిగూడెంలో జరిగిన ‘జెండా’ సభలో చంద్రబాబు మరింత ఘాటుగా విరుచుకుపడ్డారు. ‘వైనాట్ పులివెందుల?’ అంటూ, ‘వైనాట్ మెగా డీఎస్సీ, వైనాట్ జాబ్ క్యాలెండర్, వైనాట్ మద్య నిషేధం, వైనాట్ సీపీఎస్ రద్దు’ అంటూ చంద్రబాబు ఒక్కో ప్రశ్న సంధిస్తుండగా సభకు వచ్చిన జనం ఉర్రూతలూగారు. మారిన ప్రసంగాల సరళి సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబుకు ఆదరణ పెంచిందని, గతంతో పోలిస్తే వీక్షకుల సంఖ్య భారీగా పెరిగిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మేమర్స్ కూడా చంద్రబాబు డైలాగులతో మీమ్స్ క్రియేట్ చేస్తూ నెటిజన్లకు మరింత ఉత్సాహనిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ఇచ్చే కౌంటర్లకు సమాధానం చెప్పుకోలేక వైసీపీ దిక్కులు చూస్తోంది. రాబోయే రోజుల్లో చంద్రబాబు దూకుడు మరింత పెరగబోతోందని… వైసీపీ ఆంధ్రప్రదేశ్‌లో దుకాణం సర్దేసుకోవడం ఖాయమేనని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం .. #TeluguJanaVijayam #AndhraPradesh pic.twitter.com/vJG43k0zbi
— iTDP Official (@iTDP_Official) February 28, 2024
Who killed Babai @ysjagan ? #TeluguJanaVijayam #AndhraPradesh pic.twitter.com/xbnPQ5BwnQ
— iTDP Official (@iTDP_Official) February 28, 2024