ఏడు పదుల ఎనర్జిటిక్ లీడర్… వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు

Telugu BOX Office

నారా చంద్రబాబు నాయుడు.. తెలుగు రాజకీయాల్లోనే కాదు నేషనల్ పాలిటిక్స్‌లోనూ ఆయనది చెరగని చరిత్ర. రాజకీయాల్లో ఆయన రికార్డులను ఎవరూ అధిగమించలేరు. ఇక భవిష‌్యత్ లోనూ కష్టమే. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, విభజన ఏపీలో ఐదేళ్లు సీఎంగా పనిచేశారు. అంటే దాదాపు పద్నాలుగేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇక ప్రతిపక్ష నేతగా కూడా అదే రికార్డును కూడా నెలకొల్పారు. దాదాపు పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. నలభై ఏళ్ల పైనుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఎత్తుపల్లాలు చూసినా, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నా మనిషి అదరలేదు. బెదరలేదు.

చంద్రబాబు రాజకీయంగా ఎదుగుదల ఊరికే వచ్చి ఆయన తలుపు తట్టలేదు. తాను సంక్షోభం నుంచే సక్సెస్ వెతుక్కుంటానని చంద్రబాబు తరుచూ చెబుతుంటారు. తనను వెన్నుపోటుదారుడని, నయవంచకుడని ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా ఆయనే కాదు టీడీపీ శ్రేణులు కూడా పట్టించుకోరు. రాజకీయాల్లో అలాగే ఉంటారు. పార్టీ కోసం, రాజకీయం కోసం, పార్టీని నమ్ముకున్న కార్యకర్తల కోసం అలా చేయడంలో తప్పు చేయలేదనే వారే అధికంగా ఉండబట్టే ఆయన పార్టీలో తన స్థానాన్ని పదిలం చేసుకోగలిగారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఘటన ఆయన జీవితాంతం వెంటాడుతున్నా ఆయన్ని ప్రజలు ఆదరించడం వెనుక ఉద్దేశం అదే. ఆనాడు చంద్రబాబు లేకుంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడో మూతపడేదని చాలామంది అభిప్రాయపడుతుంటారు.

కష్టాలెదురైనా
ఎన్నో కష్టాలు.. ఎన్నో ప్రయాసలు.. తను సొంతం అనుకున్న వారే పార్టీని విడిచి వెళ్లిపోయినా చంద్రబాబు చలించలేదు. లోలోపల బాధపడినా అది క్యాడర్‌కు కనపించకుండా దిగమింగుకుని రాజకీయం చేసిన నేత చంద్రబాబు. 2009లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు అయితే ఎందరో ముఖ్యులు పార్టీని వీడి వెళ్లారు. దీంతో ఇక టీడీపీ పని అయిపోయినట్లేనని అనుకున్నారు. కానీ మొక్కవోని ధైర్యంతో పార్టీని నిలబట్టి.. తిరిగి అధికారంలోకి తెచ్చిన ఏకైక లీడర్ చంద్రబాబు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 2014 ఎన్నికలలో నవ్యాంధ్ర ప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రికార్డు కూడా ఆయనే సొంతం. ఇలా రికార్డుల మీద రికార్డులు పొలిటికల్‌గా ఒక చంద్రబాబుకే సొంతం.

ఒక్కడే.. ఒంటరి పోరుతో…
గత నాలుగేళ్ల నుంచి పార్టీ నేతలు బయటకు రావడం లేదు. అయినా ఆయన ఒక్కడే ఏడు పదుల వయసులో రాష్ట్రమంతటా తిరిగారు. క్యాడర్‌లో ధైర్యాన్ని నింపారు. నేతలను రోడ్లమీదకు తిరిగి తీసుకురాగలిగారు. మహానాడు సక్సెస్ చేసి మళ్లీ పార్టీకి పునరుజ్జీవం పోశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మరొకరైతే రాజకీయాలకే గుడ్‌బై చెప్పేసేవారు. కానీ అక్కడుంది చంద్రబాబు. నలభై ఏళ్లకు పైగా రాజకీయాల్లో కొనసాగుతున్నా.. ప్రజాసేవపై ఆసక్తి ఇసుమంతైనా ఆయనకు తగ్గలేదు. ఎవరైనా ఇది సాధ్యం కాదని చెబితే ఎందుకు కాదంటూ నిలబడి తేల్చుకునే మొండి ఆయన. ఆ నమ్మకమే బాబును ముందుకు నడిపిస్తోంది.

సీన్ మార్చేసి…
ఇప్పటికీ ఆయన నాయకత్వంపై అందరి నమ్మకం. అందరి ఆశలు. అందుకే ఆయననే పార్టీ అధినేతగా ఇప్పటికీ పార్టీలో 90 శాతం మంది కోరుకుంటారు. అదీ ఆయన సమర్థత. పొత్తులు కుదర్చుకుని అధికారంలోకి వస్తారన్న అపప్రధను ఆయన ఎదుర్కొనవచ్చు. ఎవరికైనా పొత్తులు సహజమే. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లాంటివి కూడా కొన్ని రాష్ట్రాల్లో అవసరమైన సందర్భాల్లో పొత్తులు పెట్టుకుంటాయి. అలాంటి విమర్శలను చంద్రబాబు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ పట్టించుకోరు.

పోరాట యోధుడు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో జగన్ సర్కారు ఆయన్ని అరెస్ట్ చేసి 50 రోజులకి పైగా జైల్లో పెట్టినా ఆయనలో ఒక్కశాతమైనా ఆవేదన కనిపించలేదు. తనని జైలుకు పంపిన జగన్‌కి అధికారం దూరం చేస్తానని శపథం పూనిన బాబు.. బెయిల్‌పై బయటకు రాగానే తన కార్యాచరణ మొదలుపెట్టేశారు. బాబు అరెస్ట్ కావడంతో టీడీపీ ఇక ఖాళీ అయిపోతుందని ప్రత్యర్థులు సంబరపడగా.. కేడర్‌ని చెక్కుచెదరనీయకుండా కాపాడుకోగలిగారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రమంతా తిరుగుతూ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 73ఏళ్ల వయసులోనూ యువనేతగా ఆయన కనబరిచే నిబద్ధత, ఉత్సాహం చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. మొన్నటి వరకూ ఏపీలో ఇక టీడీపీ ఖతం అన్న స్థాయి నుంచి ఈసారి అధికారం టీడీపీదే అన్న స్థాయికి తీసుకువచ్చారంటే అది ఖచ్చితంగా చంద్రబాబు ఘనతే.

Share This Article
Leave a comment