టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా భారత జట్టు నిలిచిన విషయం తెలిసిందే. 140 కోట్ల మంది భారతీయులు గర్వపడే విధంగా రోహిత్ సేన.. వెస్టిండీస్ గడ్డపై విజయకేతనం ఎగురవేసింది. రోహిత్ శర్మ అయితే.. విజయం సాధించిన తర్వాత.. నిజంగానే బార్బోడోస్ గ్రౌండ్‌లో భారత జాతీయ జెండాను పాతేశాడు. మొత్తంగా.. విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, బుమ్రా, హార్ధిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా అత్యాద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.. ఫైనల్‌లో పటిష్టమైన సౌతాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి.. విశ్వవిజేతగా అవతరించింది. మరి ఛాంపియన్‌గా నిలిచి టీమిండియాకు ఎంత ప్రైజ్‌మనీ దక్కిందో ఇప్పుడు తెలుసుకుందాం..
టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా 2.45 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.20.42 కోట్లు ప్రైజ్‌మనీగా అందించింది ఐసీసీ. ఇది ఐపీఎల్‌లో విజేతకు అందించే ప్రైజ్‌మనీ కంటే ఎక్కువ. ఐపీఎల్‌లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.20 కోట్లు ప్రైజ్‌మనీగా ఇస్తారు. అలాగే ఫైనల్‌లో అద్భుతంగా పోరాడి.. రన్నరప్‌గా నిలిచిన సౌతాఫ్రికాకు 1.28 మిలియన్ డాలర్లు.. ఇండియన్ కరెన్సీలో రూ.10.67 కోట్లు ప్రైజ్‌మనీగా అందించారు. అలాగే సెమీ ఫైనల్ వరకు వచ్చిన ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లకు రూ.6.56 కోట్ల చొప్పున ప్రైజ్‌మనీ కింద ఇచ్చారు. సూపర్ 8కు చేరిన ప్రతి టీమ్‌కు రూ.3.17 కోట్లు చొప్పున అందించారు. వీళ్లతో పాటు 9 నుంచి 12వ స్థానాల్లో నిలిచి జట్లకు రూ.2.05 కోట్లు, 13 నుంచి చివరిదైన 20వ స్థానంలో నిలిచి టీమ్స్‌కు రూ.1.87 కోట్ల చొప్పున అందించారు. వీరితో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన జస్ప్రీత్ బుమ్రాకు రూ.12.45 లక్షల నగదు బహుమతి అందించారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 76, అక్షర్ పటేల్ 47, శివమ్ దూబే 27 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మహరాజ్, నోర్జే రెండేసి వికెట్లు పడగొట్టారు. మార్కో జాన్సెన్, రబాడ చెరో ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఇక 177 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేసి విజయానికి 8 పరుగుల దూరంలో ఆగిపోయింది. క్వింటన్ డికాక్ 39, ట్రిస్టన్ స్టబ్స్ 31, హెన్రిచ్ క్లాసెన్ 52, డేవిడ్ మిల్లర్ 21 పరుగులతో రాణించినా.. చివర్లో ఒత్తిడికి చిత్తయ్యారు. దానికి తోడు బుమ్రా, అర్షదీప్, పాండ్యా కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తలొగ్గారు. భారత బౌలర్లలో అర్షదీప్ 2, బుమ్రా 2, పాండ్యా 3, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నారు.