టార్గెట్ మంగ‌ళ‌గిరి… నారా లోకేష్ గెలుపు ఫిక్స్ అయినట్లేనా!

Telugu BOX Office

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏమైనా జ‌ర‌గొచ్చు. నిన్న ఓడిన నేత‌ రేపు భారీ మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకోవ‌చ్చు. నిన్న బ‌ల‌మైన నాయ‌కుడు రేపు బ‌ల‌హీన‌మైన నేత‌గా మారిపోవ‌చ్చు. ప్రజ‌ల ఆశీస్సులు.. ఎన్నిక‌ల మూడ్ వంటి అంశాలే నాయ‌కుల‌ గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. ఒకసారి ఓడిపోయామని వెనకడుగు వేస్తే భవిష్యత్తే ఉండదు.. ప్రజల్లో చులకన అయిపోతారు. పడినచోటే లేచి తిరిగి విజయం సాధిస్తే ఆ కిక్కే వేరు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు లోకేష్ ఇప్పుడు ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు కేబినెట్లో లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని ఆయనకు ఎమ్మెల్సీ కట్టబెట్టి మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు. దీంతో లోకేష్‌ని ప్రతిపక్ష నేతలు బ్యాక్ డోర్ మినిస్టర్ అంటూ ఎద్దేవా చేసేవారు. అవన్నీ పట్టించుకోకుండా ఐటీ శాఖ మంత్రి మంచి పనితీరునే కనబర్చారు లోకేష్. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మంగళగిరి నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు.

అప్పటి అంచ‌నాల మేర‌కు.. లోకేష్ విజ‌యం ‘ప‌క్కా’ అని టీడీపీ నాయ‌కులతో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం రాసిపెట్టుకున్నారు. రాజ‌ధానిగా అమ‌రావ‌తి ప్రాంతాన్ని ఎంపిక‌ చేయ‌డం.. యువ నాయ‌కుడిగా ప్రజ‌ల్లో తిరగడం… హైప్రొఫెల్ నాయ‌కుడిగా చంద్రబాబుకు ఉన్న గుర్తింపు నేప‌థ్యంలో ఆయ‌న‌ వార‌సుడిగా ఉన్న నారా లోకేష్ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని భావించారు. కానీ, 2019లో ఈ లెక్కలు తారుమారయ్యాయి. వైసీపీ అభ్యర్థి ఆళ్లా రామకృష్ణారెడ్డి చేతిలో లోకేష్ 5వేల ఓట్ల తేడాతో పరాజయం కావడం అందరినీ షాక్‌కి గురిచేసింది. చాలామంది టీడీపీ నేతలైతే పార్టీ ఓడిపోయిన దానికంటే లోకేష్ ఓడిపోవడంతోనే దిగ్భ్రాంతికి గురయ్యారు.

త్వర‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోసారి ఇక్కడ నుంచే నారా లోకేష్ పోటీకి రెడీ అయ్యారు. గత ఎన్నికల్లో ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన‌ప్పటికీ.. ప‌డిన చోటి నుంచే పైకి లేవాల‌ని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆయ‌న పట్టుదలగా ఇక్కడ‌ పని చేసుకుంటున్నారు. పార్టీ తరపున సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్ ఓడిపోయినా.. ఆయ‌న హ‌వా మాత్రం చెక్కు చెద‌ర‌లేదనే టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు చేనేత‌లు ఎక్కువ‌గా ఉండ‌డంతో వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. వీధి వ్యాపారుల‌కు తోపుడు బండ్లు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నారు. మ‌రోవైపు నారా లోకేష్ స‌తీమ‌ణి నారా బ్రాహ్మణి కూడా తరుచూ మంగళగిరిలో పర్యటిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న భ‌ర్త నారా లోకేష్‌ను గెలిపించాల‌ని ఆమె కోరుతున్నారు. మెజారిటీ సామాజిక వ‌ర్గం ఇక్కడ చేనేత‌లే కావ‌డంతో వారిని ల‌క్ష్యంగా చేసుకుని నారాలోకేష్ ముందుకు సాగుతున్నారు.

నారా లోకేష్‌ను ఓడించి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న అధికార పార్టీ వైసీపీ కూడా మంగ‌ళ‌గిరిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మంగళగిరిలో గత రెండు సార్లు వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. ఆళ్ల ఇటీవ‌ల వైసీపీకి గుడ్ బై చెప్పి కొద్దిరోజుల్లోనే యూటర్న్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఈసారి బీసీ కార్డు ప్రయోగానికి సిద్ధమైంది. చేనేత వర్గీయుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో.. అదే వర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే గంజి చిరంజీవిని ఇన్‌చార్జ్‌గా ప్రకటించారు. దీంతో తనకు టిక్కెట్ కన్ఫార్మ్ అనుకుని చిరంజీవి నియోజకవర్గంలో దూకుడు పెంచగా కొద్దిరోజులకే అధిష్ఠానం షాకిచ్చింది. ఆయన స్థానంలో మురుగుడు లావణ్యను మంగళగిరి ఇంఛార్జిగా నియమించడటంతో గంజి చిరంజీవికి కరెంట్ షాక్ కొట్టినంత పనైంది. నారా లోకేష్‌ని మరోసారి ఎలాగైనా ఓడించి తీరాలని కంకణం కట్టుకున్న వైసీపీ అధిష్ఠానం ఆయనపై బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తోంది. దీంతో మురుగుడు లావణ్యను కూడా చివరి నిమిషంలో మార్చవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది.


మంగళగిరిలో నారా లోకేష్ బలాబలాలివే:

బలాలు:

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయార‌న్న సానుభూతి
అమ‌రావ‌తి రైతుల ఉద్యమానికి మ‌ద్దతు
యువ‌గ‌ళం పాద‌యాత్ర తాలూకు సింప‌తీ
బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తార‌నే చ‌ర్చ
అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడం, ఇతర సేవా కార్యక్రమాలు
యువ నాయ‌కుడిగా యువ‌త‌ను ప్రోత్సహిస్తున్న తీరు

బ‌ల‌హీన‌త‌లు:

స్థానికేతర నేత కావడం
బీసీ సామాజిక వ‌ర్గమైన చేనేత‌ల్లో బ‌ల‌మైన ఓటు బ్యాంకును తన త‌న‌వైపు తిప్పుకోలేక‌పోతున్నార‌నే వాద‌న‌

Share This Article
Leave a comment