జెంటిల్మన్ క్రీడగా ముద్రపడిన క్రికెట్‌లో తరుచూ ఏదొక వివాదం జరుగుతూనే ఉంటుంది. ఆటగాళ్ల ప్రవర్తన, అంపైర్ నిర్ణయాలపైనా తరుచూ విమర్శలు వస్తూనే ఉంటాయి. కీలక మ్యాచ్‌ల్లో ఓడిపోయిన జట్లు ఆ తప్పిదాన్ని అంపైర్‌లపైకి తోసేయం చూస్తూనే ఉంటాం. అలాగే వైడ్ బాల్స్‌ను అంపైర్ రైట్ బాల్‌గా ఇవ్వడం, నోబాల్స్ విషయంలో జరిగే తప్పిదాలు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుంటాయి. అంపైర్ ఒక్క తప్పు నిర్ణయం తీసుకున్నా జయాపయాలు తల్లకిందులు అవుతుంటాయి. ఒక్కొక్కప్పుడు క్రికెట్ అభిమానులు తమ జట్టు ఓటమిని కవర్ చేసుకోవడానికి లేని వివాదాలను తెరపైకి తెస్తుంటారు. ఇప్పుడు అలాంటి వివాదమే టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌పై జరుగుతోంది.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికా, భారత్ మధ్య శనివారం ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 176 పరుగులు చేసింది. 177 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఫైనల్ మ్యాచ్‌లో చివరి వరకు దక్షిణాఫ్రికా అధిపత్యం చెలాయించింది. ఆఖరి ఓవర్‌లో విజయానికి 16 పరుగులు చేయాల్సి ఉండగా.. క్రీజ్‌లో డేవిడ్ మిల్లర్ ఉన్నారు. పాండ్యా వేసిన 20వ ఓవర్ మొదటి బంతిని గాల్లోకి కొట్టగా బౌండరీ లైన్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. అయితే అది సిక్స్ అని అందరూ అనుకోగా… అంచనాలు తలకిందులు చేస్తూ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయి భారత్ లైన్లోకి వచ్చింది. చివరికి ఏడు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి పొట్టి కప్పు అందుకోగా.. ఓటమి భారంతో సౌతాఫ్రికా గుండె పగిలింది.
సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్‌పై ఫీల్డ్ అంఫైర్ ధర్డ్ అంపైర్‌ను సంప్రదించాడు. రెండు, మూడు సార్లు పరిశీలించిన తర్వాత మిల్లర్‌ను అవుట్‌గా ప్రకటించారు. ఈ నిర్ణయంతో సౌతాఫ్రికా ఆటగాళ్లు, మాజీలు, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మ్యాచ్ పూర్తైన తర్వాత ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ సూర్యకుమార్ యాదవ్ షూ బౌండరీ లైన్‌ను తాకిందని సఫరా ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. థర్డ్ అంపైర్ బిగ్ స్క్రీన్‌లో చూసిన తర్వాత తుది నిర్ణయం వెల్లడించినప్పటికీ మరో రెండు మూడు సార్లు పరిశీలించి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. విజయం అంచుల్లో ఉన్న సౌతాఫ్రికా ఓటమి చెందడానికి ఆ క్యాచే కారణం కావడంతో వారి బాధ వర్ణణాతీతంగా మారింది. ప్రస్తుతం ఈ క్యాచ్ చుట్టూ వివాదం చెలరేగడంతో ఐసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.