షాకింగ్: టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రవీంద్ర జడేజా

Telugu BOX Office

భారత్ టీ20 ప్రపంచకప్ గెలుచుకోవడంతో దిగ్గజ ఆటగాళ్లు రిటైర్మెంట్ బాట పట్టారు. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించగా.. వారి బాటలోనే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కీలక ప్రకటన చేశాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇన్‌స్ట్రాగ్రామ్‌ వేదికగా వెల్లడించాడు. టీమిండియా ప్రపంచకప్ సాధించిన కొద్ది గంటల్లోనే ఈ నిర్ణయం వెల్లడించడం గమనార్హం.

2007లో తొలి పొట్టి కప్ సాధించిన భారత్.. మళ్లీ ఆ కప్పును అందుకోవడానికి 17 ఏళ్లు పట్టింది. ఇదే మంచి సందర్భమనుకున్న విరాట్ కోహ్లి.. తమ టీ20 కెరీక్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఇక ట్రోఫీని ముద్దాడిన అనంతరం రోహిత్ శర్మ సైతం.. తాను ఇక భారత్‌ తరఫున టీ20లు ఆడబోనని చెప్పేశాడు. వీరి బాటలోనే రవీంద్ర జడేజా సైతం టీ20 కెరీర్‌కు గుడ్‌బై వెల్లడించాడు.

ఇప్పటివరకు 74 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన రవీంద్ర జడేజా.. 515 పరుగులు చేసి 54 వికెట్లు పడగొట్టాడు. తాను దేశానికి అత్యుత్తమ క్రికెట్ ఆడానని చెప్పుకొచ్చిన జడేజా.. టీ20 కెరీర్‌కు వీడ్కోలు పలకడానికి ఇదే మంచి తరుణమని భావించినట్లు వెల్లడించాడు. పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా.. వన్డే, టెస్టుల్లో కొనసాగుతానని తెలిపాడు.

టీమిండియా మంచి ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న రవీంద్ర జడేజా… టెస్టులు, వన్డేలతో పోలిస్తే టీ20ల్లో రవీంద్ర జడేజా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. తాజా టీ20 ప్రపంచకప్‌‌లోనూ అంచనాలు అందుకోలేకపోయాడు. రెండేళ్ల తర్వాత జరగనున్న టీ20 ప్రపంచకప్‌ కోసం ఇప్పటి నుంచే యువ ఆటగాళ్లను తయారు చేయాలని టీమిండియా యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో రోహిత్, కోహ్లి తప్పుకోగా.. జడేజా కూడా వారినే అనుసరించాడు. ప్రపంచకప్ వచ్చిన ఆనందంలో ఉన్న భారత క్రికెట్అభిమానులు మాత్రం ఈ దిగ్గజాల రిటైర్మెంట్‌పై భావోద్వేగానికి గురవుతున్నారు. వీరిని మళ్లీ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో చూడలేమంటూ ఎమోషనల్ అవుతున్నారు.

Share This Article
Leave a comment