తెలుగు రాజకీయాల్లో నారా చంద్రబాబునాయుడిది ఓ సుస్థిర ప్రస్థానం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా పనిచేసిన అరుదైన ఘనత ఆయన సొంతం. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లో సీనియర్ నేతగా, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు గుర్తింపు తెచ్చుకున్నారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా.. 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. అటు ఢిల్లీ రాజకీయాల్లోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. విభజన తర్వాత నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలవడంతో.. ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు.
చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె చంద్రబాబు నాయుడి స్వస్థలం. 1950 ఏప్రిల్ 20న ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ దంపతులకు ఆయన జన్మించారు. తిరుపతిలోని వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎకనమిక్స్‌లో పీజీ పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన చంద్రబాబు.. 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 28వ ఏళ్ల వయసులోనే.. టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1981లో నందమూరి తారక రామారావు కుమార్తె భువనేశ్వరిని పెళ్లాడారు. 1982లో ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేసినా చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగారు. 1983 ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించగా.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి చంద్రబాబు ఓటమి పాలయ్యారు. అనంతరం ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు టీడీపీలో చేరారు.
1989 ఎన్నికల్లో కుప్పం నుంచి గెలుపొందిన చంద్రబాబు నాయుడు.. శాసన సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 1994 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. కానీ ఏడాది తర్వాత అనూహ్య పరిణామాల మధ్య ఎన్టీఆర్ పదవీచిత్యుడు కాగా.. చంద్రబాబు సీఎం పగ్గాలను చేపట్టారు. 1995 నుంచి 2004 వరకు ఆయన ఏపీ సీఎంగా వ్యవహరించారు. 1996 లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో సంకీర్ణం ఏర్పాటు కావడంతో.. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పారు. 1999 నుంచి 2004 వరకు ఎన్డీయే కన్వీనర్‌గా వ్యవహరించారు.
హైదరాబాద్‌లో ఐటీ రంగం పురోగతి సాధించడానికి చంద్రబాబు నాయుడు విశేషంగా కృషి చేశారు. ఇప్పుడు సైబరాబాద్‌గా పిలవబడుతున్న ప్రాంతానికి బీజం వేసింది చంద్రబాబే. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడైన బిల్ క్లింటన్‌ని హైదరాబాద్‌కు రప్పించి అందరినీ ఆశ్చరపరిచారు. అప్పట్లో చంద్రబాబును సీఎంగా కంటే సీఈవో అని పారిశ్రామికవేత్తలు పిలిచేవారంటేనే ఆయన పరిపాలన ఏ విధంగా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. 2003లో అలిపిరి వద్ద మావోయిస్టుల దాడి నుంచి చంద్రబాబు నాయుడు తృటిలో తప్పించుకున్నారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ ఓడటంతో చంద్రబాబు దాదాపు పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు. 2014లో తెలుగు రాష్ట్రాలు విడిపోగా.. నవ్యాంధ్యలో టీడీపీ ఘనవిజయం సాధించింది. దీంతో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా.. నవ్యాంధ్రకు తొలి సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. ఈ నాలుగున్నరేళ్లుగా ఎన్నో ఆటుపోట్లకు గురైన తొణకని చంద్రబాబు.. 2024లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు.