భూకంపం సృష్టించిన పెను విధ్వంసం, ప్రాణనష్టం మొరాకో వాసులను షాక్‌కు గురిచేసింది. ఈ ఉత్తర ఆఫ్రికా దేశంలో ఇంత తీవ్రస్థాయిలో భూకంపం రావడం 120 ఏళ్లలో ఇదే మొదటిసారి. దేశంలోని మర్రకేశ్, మరో అయిదు ప్రావిన్స్‌ల్లో శుక్రవారం అర్ధరాత్రి రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ప్రజలు భయాందోళనలతో వీధుల్లో రెండో రోజూ చీకట్లోనే జాగారం చేశారు. సహాయక చర్యలను ప్రభుత్వ యంత్రాంగం ముమ్మరం చేసింది.
శిథిలాలను తొలగిస్తుండటంతో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 2,012కు చేరింది. క్షతగాత్రులైన మరో 2,059 మందిలో 1,404 మందికి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు చెబుతున్నారు. మృతుల్లో విదేశీయులూ ఉన్నారు. అయితే భారతీయులెవరూ గాయపడలేదని మొరాకోలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. భవనాల శిథిలాల కింద చిక్కుకుని ఉన్న వారిని గుర్తించి, కాపాడేందుకు ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. సుదూరంగా కొండ ప్రాంతాల్లో ఉన్న పల్లెలకు సహాయక బృందాలు చేరడం కష్టంగా మారింది. అక్కడి మట్టిరోడ్లపై బండరాళ్లు పడిపోవడంతో టాక్సీలు, అంబులెన్సులు, రెడ్ క్రాస్ సిబ్బంది వాహనాలు ముందుకు వెళ్లడం కష్టంగా మారింది. దీంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. అక్కడ జరిగిన నష్టం వివరాలు కూడా వెల్లడైతే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు.
ఈ విలయానికి తీవ్రంగా ప్రభావితమైన అల్ హౌజ్ ప్రావిన్స్‌లో మరణాలు అత్యధికంగా 1,293 నమోదయ్యాయి. ఆ తర్వాత టరౌడంట్ ప్రావిన్స్‌లో 452 మంది చనిపోయారు. అమెరికా, ఇజ్రాయెల్, అల్జీరియా, జర్మనీ, యూఏఈ, జోర్డాన్ తదితర దేశాలతోపాటు డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ వంటి సంస్థలు చేయూత అందించేందుకు ముందుకు వచ్చాయి.