ఇతరులకు టిక్కెట్లు బుక్ చేస్తే జైల్లో వేస్తారా.. రైల్వే శాఖ క్లారిటీ

Telugu BOX Office
xr:d:DAFRb3nfWJc:3,j:40441575530,t:22110908
xr:d:DAFRb3nfWJc:3,j:40441575530,t:22110908

ఈమధ్య ఎక్కడ చూసినా ఫేక్ ప్రచారం ఎక్కువైంది. మొన్నటికిమొన్న తిరుమల దర్శనం టికెట్లు, లడ్డూపై జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయింది ఆ అసత్య ప్రచారం. దానికి మించి దేశవ్యాప్తంగా వైరల్ అయింది మరో ఫేక్ న్యూస్. ఆన్ లైన్లో రైల్వే టికెట్ల బుకింగ్ కు సంబంధించి, ఇకపై ఎవరి ఐడీ నుంచి వాళ్లు మాత్రమే టికెట్లు బుక్ చేయాలని, లేదా వాళ్ల రక్త సంబంధీకులకు మాత్రమే టికెట్ బుక్ చేయాలని, వేరే వ్యక్తులకు బుక్ చేస్తే, జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుందంటూ 48 గంటలుగా ప్రచారం సాగుతోంది.

ఎట్టకేలకు రైల్వే దీనిపై స్పందించింది. అదంతా ఫేక్ ప్రచారమని కొట్టిపారేసింది. ఈ-టికెట్ బుకింగ్స్ కు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న గైడ్ లైన్స్ ప్రకారమే అన్నీ సాగుతాయని, ఇంటిపేరు మారితే జైలుశిక్ష పడుతుందనే ప్రచారం పూర్తిగా అబద్ధమని ఐఆర్సీటీసీ ప్రకటించింది. వ్యక్తిగత ఖాతాపై ఎవరైనా తమకు, తమ బంధువులకు లేదా స్నేహితులకు టికెట్లు బుక్ చేయొచ్చని రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. ఒక ఐడీపై నెలలో 12 టికెట్లు బుక్ చేసుకోవచ్చని, ఆధార్ అథెంటికేషన్ పూర్తిచేసిన యూజర్స్, నెలకు 24 టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. వ్యక్తిగత ఖాతాపై బుక్ చేసిన టికెట్లను బయట విక్రయించకూడదని స్పష్టం చేసిన రైల్వేస్.. ఇవన్నీ పాత నిబంధనలేనని, మరోసారి గుర్తు చేస్తున్నామని వెల్లడించింది.

ఈ అంశంపై గడిచిన 2 రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే చర్చ. పెళ్లయిన తర్వాత మహిళలకు ఇంటిపేరు మారుతుందని, అలాంటప్పుడు టికెట్ బుక్ చేస్తే జైళ్లో వేస్తారా అంటూ కొందరు ప్రశ్నిస్తే.. శర్మ అనే ఇంటిపేరు ఉన్న వ్యక్తి దేశంలో ఉన్న శర్మలందరికీ టికెట్ బుక్ చేయొచ్చా అంటూ మరొకరు సెటైర్ వేశారు. ఇలా ఓ రేంజ్ లో చర్చ నడిచిన తర్వాత తాజాగా ఐఆర్సీటీసీ ఈ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టింది.

Share This Article
Leave a comment