231 km.. రూ.10 వేల కోట్ల వ్యయం.. హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణకు డీపీఆర్‌ సిద్ధం!

Telugu BOX Office

హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న ఈ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించడానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధమైనట్లు సమాచారం. ఈ విస్తరణకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించబడింది. ఈ నెల రెండో వారంలో ఈ నివేదికను ప్రాజెక్టు ఎప్రైజల్‌ అండ్‌ టెక్నికల్‌ స్క్రూటినీ కమిటీ (పీఏటీఎస్‌సీ) ముందు ఒపెన్ చేయనున్నారు.

ఈ విస్తరణ కోసం మొత్తం 231.32 కిలోమీటర్ల మార్గాన్ని పునర్‌వ్యవస్థీకరించనున్నారు. ఇందులో 209.07 కిలోమీటర్లు బ్రౌన్‌ఫీల్డ్‌ (ఉన్న రహదారి విస్తరణ), 22.25 కిలోమీటర్లు గ్రీన్‌ఫీల్డ్‌ (కొత్త మార్గం/బైపాస్) గా ప్రణాళిక చేశారు. తెలంగాణ పరిధిలో ప్రధానంగా ప్రస్తుత రహదారినే 4 వరుసల నుంచి 6 వరుసలుగా విస్తరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అంబారుపేట–ఐతవరం ప్రాంతాల్లో 7.3 కిలోమీటర్లు, అలాగే కాచవరం–పల్లిపాడు పరిధిలో 16.15 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్లు ఏర్పాటు కానున్నాయి. ఇవి ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి ప్రయాణకాలాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

రహదారి విస్తరణలో భాగంగా 4 ప్రధాన ఫ్లైఓవర్లు, 60 వాహనాల అండర్‌పాస్‌లు, అలాగే అడవుల్లో జంతువులు రోడ్డు దాటేందుకు 10 ప్రత్యేక అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. భూసేకరణ అవసరాన్ని కూడా గుర్తించారు — మొత్తం 182.41 హెక్టార్ల భూమి దీనికి అవసరం అవుతుంది. ఈ రహదారి విస్తరణ మల్కాపూర్ (యాదాద్రి) నుంచి ప్రారంభమై చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ, నవాబుపేట, ఆపై నందిగామ, కీసర, పరిటాల, ఇబ్రహీంపట్నం మీదుగా విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ వరకు సాగనుంది.

ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లకు పైగా వ్యయం అవుతుందని అంచనా. డీపీఆర్‌కు పీఏటీఎస్‌సీ ఆమోదం వచ్చిన వెంటనే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ ఎప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) ముందు నివేదికను ఉంచుతారు. ఆ కమిటీ ఆమోదం అనంతరం, కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ తుది ఆమోదం ఇస్తుంది. ఇవన్నీ సజావుగా జరిగితే, టెండర్లు వచ్చే 2–3 నెలల్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు 2026–27 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమయ్యేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ రహదారి విస్తరణ పూర్తయితే హైదరాబాద్–విజయవాడ ప్రయాణ సమయం తగ్గి, పరిశ్రమలు, వ్యాపార రవాణాకు  మరింత సానుకూలంగా మారనుంది.

Share This Article
Leave a Comment