ఏపీకి గుడ్‌న్యూస్.. అమరావతి మీదుగా బుల్లెట్ రైలు

Telugu BOX Office

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఓ వైపు చురుగ్గా సాగుతుంటే.. ఆ నగరాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో కనెక్ట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి చెన్నై మధ్య వచ్చే హైఎలివేటెడ్ రైలు ప్రాజెక్టులో అమరావతిని చేర్చారు. అమరావతి మీదుగా ఈ రైళ్లు పరుగులు పెట్టేందుకు వీలుగా హైదరాబాద్‌-చెన్నై మధ్య హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ రైలు కారిడార్‌ ఎలైన్‌మెంట్‌కు కేంద్రం నుంచి ప్రాథమిక ఆమోదం లభించింది. ఇది సీఆర్డీయే మీదుగా వెళ్లనుంది. అలాగే కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల మీదుగా కూడా బుల్లెట్‌ రైళ్లు పరుగులు పెట్టేలా.. హైదరాబాద్‌-బెంగళూరు హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ఎలైన్‌మెంట్‌కూ ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ రెండింటి నిర్మాణంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖచిత్రమే మారిపోనుంది.

మెట్రో నగరాల మధ్య బుల్లెట్‌రైళ్లు నడిపేందుకు కేంద్రం హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ కారిడార్లు నిర్మిస్తుండగా, ఇందులో ఏపీ మీదుగా హైదరాబాద్‌-చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్లకు చోటు కల్పించారు. ఈ రెండు కారిడార్లలోనూ హైదరాబాద్‌ నుంచి శంషాబాద్‌ వరకు 38.5 కి.మీ. కామన్‌గా ఉండనుంది. అక్కడి నుంచి చెన్నై, బెంగళూరు వైపు వేర్వేరు కారిడార్లు ఉంటాయి.

హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ కారిడార్‌ కోసం 744.57 కి.మీ., 839.5 కి.మీ., 749.5 కి.మీ.లతో మూడు లైన్‌మెంట్లను పరిశీలించి, ఇందులో 744.5కి.మీ. ఎలైన్‌మెంట్‌ను ప్రాథమికంగా ఖరారు చేశారు. ఇందులో తెలంగాణలో ఆరు, ఏపీలో ఎనిమిది, తమిళనాడులో ఒక స్టేషన్‌ నిర్మిస్తారు. ఇది హైదరాబాద్‌ పరిధిలోని.. హైదరాబాద్‌-ముంబయి హైస్పీడ్‌ రైలు కారిడార్‌ నుంచి మొదలై.. శంషాబాద్, నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం/కోదాడ మీదుగా వచ్చి సీఆర్డీయే మీదుగా గుంటూరు వైపు వెళ్తుంది. అక్కడి నుంచి చీరాలవైపు వెళ్లి విజయవాడ-చెన్నై రైల్వేలైన్‌కు సమాంతరంగా చెన్నై వెళ్తుంది. తెలంగాణలో 236.48 కి.మీ., ఏపీలో 448.11 కి.మీ, తమిళనాడులో 59.98 కి.మీ. వెళ్తుంది. ఇది నేరుగా చెన్నైకి కాకుండా తిరుపతి మీదుగా వెళ్లేలా ఎలైన్‌మెంట్‌లో మారిస్తే తిరుపతికి వెళ్లేవారికి ప్రయోజనకరమనే చర్చ వచ్చింది. గూడూరు నుంచి తిరుపతి మీదుగా చెన్నై వెళ్లేలా మారిస్తే.. కారిడార్‌ పొడవు మరో 53.5 కి.మీ. పెరగనుంది. అప్పుడు నాయుడుపేట, తడ తగలవు. ఈ ప్రాజెక్టులో రెండు వరుసల లైన్‌ (డబుల్‌ ట్రాక్‌), లూప్‌లైన్లు, సైడింగ్స్‌ కలిపి మొత్తం 1,419.4 కి.మీ. ట్రాక్‌ నిర్మించాలి.

అలాగే హైదరాబాద్‌-బెంగళూరు హైస్పీడ్‌ రైలు కారిడార్‌కు 576.6 కి.మీ., 558.2 కి.మీ., 621.8 కి.మీ.తో మూడు ఎలైన్‌మెంట్లు పరిశీలించారు. ఇందులో 576.6 కి.మీ. ఎలైన్‌మెంట్‌ను ప్రాథమికంగా ఎంపిక చేశారు. ఇది చాలావరకు ప్రస్తుతమున్న హైదరాబాద్‌-బెంగళూరు హైవేకి సమాంతరంగా వెళ్తుంది. తెలంగాణలో 4, ఏపీలో 6, కర్ణాటకలో 3 స్టేషన్లు నిర్మిస్తారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో కియా పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలు ఉండడంతో.. అక్కడ దుద్దేబండ వద్ద స్టేషన్‌ ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో తెలంగాణలో 218.5 కి.మీ., ఏపీలో 263.3 కి.మీ., కర్ణాటకలో 94.80 కి.మీ. ఉంటుంది. డబుల్‌ లైన్, అదనంగా లూప్‌లైన్స్, సైడింగ్‌లు కలిపి మొత్తం 1,363 కి.మీ. మేర ట్రాక్‌ నిర్మిస్తారు. హైదరాబాద్‌-అమరావతి-చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు మధ్య బుల్లెట్‌ రైళ్ల కారిడార్లు పూర్తయ్యి.. అలాగే బెంగళూరు-చెన్నై మధ్య చేపట్టే బుల్లెట్‌ రైలు ప్రాజెక్టూ అందుబాటులోకి వస్తే  హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు నగరాల మధ్య బుల్లెట్‌ రైళ్ల చతుర్భుజి వచ్చినట్లు అవుతుంది. దీనివల్ల ఈ నగరాల మధ్య గంట నుంచి రెండు గంటల్లోనే చేరుకునే అవకాశం కలగనుంది.

Share This Article
Leave a Comment