ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. రెండోసారి అధికారం చేపట్టాలని వైసీపీ.. అధికార పక్షాన్ని సమర్థంగా ఎదుర్కొని తాము విజయం సాధించాలని టీడీపీ-జనసేన కూటమి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. వైసీపీ ఇప్పటికే అనేక నియోజవర్గాలకు ఇంఛార్జులను ప్రకటించగా.. టీడీపీ-జనసేన పార్టీలు కొద్దిరోజుల క్రితం అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశాయి. తెలుగుదేశం పార్టీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. జనసేన 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో విజయనగరం జిల్లా గజపతినగరం నియోజవర్గం అభ్యర్థిగా టీడీపీ నేత కొండపల్లి శ్రీనివాస్‌కు టిక్కెట్ దక్కడం విశేషం.
పూర్వపు బొబ్బిలి ఎంపీగా సేవలందించిన కొండపల్లి పైడితల్లి నాయుడు మనవడిగా.. గంట్యాడ ఎంపీపీగా పనిచేసిన కొండపల్లి శ్రీనివాస్ తనయుడిగా రాజకీయ వారసత్వం పుణికిపుచ్చుకుని తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు కొండపల్లి శ్రీనివాస్. ప్రస్తుత గజపతినగరం టీడీపీ ఇంఛార్జి కొండపల్లి అప్పలనాయుడు ఆయనకు బాబాయి అవుతారు. అయితే టీడీపీ టిక్కెట్ కచ్చితంగా తనకే వస్తుందని అప్పలనాయుడు ఆశించగా.. అధిష్ఠానం మాత్రం శ్రీనివాస్ వైపే మొగ్గుచూపింది. దీంతో అప్పలనాయుడు వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గజపతినగరం టిక్కెట్ విషయంలో చంద్రబాబునాయుడు పునరాలోచించుకోవాలని ఆయన అనుచరులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే బేషజాలు పక్కనపెట్టి కొండపల్లి శ్రీనివాస్ తన గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. చంద్రబాబునాయుడు, లోకేష్, పవన్‌కళ్యాణ్ ఎంతో నమ్మకంతో తనకు టిక్కెట్ కేటాయించారని.. గజపతినగరం నుంచి భారీ మెజార్టీతో గెలిచి వారికి బహుమతి ఇస్తానని చెబుతున్నారు. తాను రాజకీయాలకు కొత్త అయినప్పటికీ తన కుటుంబం ఎన్నో దశాబ్దాలుగా రాజకీయాల్లోనే ఉందని శ్రీనివాస్ వెల్లడించారు. అటు టీడీపీ సీనియర్లను, ఇటు జనసేన నేతలతో సమన్వయం చేసుకుని గెలుపే లక్ష్యంతో ముందుకెళ్తానంటున్నారు.
టీడీపీ ఆవిర్భావం నుంచి తన కుటుంబం ఆ పార్టీలోనే కొనసాగుతోందని.. కొండపల్లి కుటుంబం నుంచి మూడో తరం నాయకుడిగా టీడీపీ అధిష్థానం తనకు అవకాశం ఇచ్చిందన్నారు. జగన్ పాలన అవినీతి, అక్రమాలు, కక్ష ధోరణిగా కొనసాగుతోందని.. ఈ సైకో జగన్‌ను వదిలించుకోవాలంటే బాబు పాలన రావాలంటూ కేడర్‌ను శ్రీనివాస్ ఉత్సాహపరుస్తున్నారు. తనను ఆదరించి గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్న తాను అందరి నాయకులను కలుపుకొని పోతూ కచ్చితంగా గెలుస్తానని కొండపల్లి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.