‘ఈనాడు’ సంస్థల అధిపతి రామోజీరావు కన్నుమూత

Telugu BOX Office

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు. రామోజీరావు మరణం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

1936 నవంబర్‌ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తర్వాత ఆయన జన్మించారు. కుటుంబసభ్యులు రామోజీకి.. తాతయ్య రామయ్య పేరు పెట్టారు. బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పి.. తన పేరును తనే పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచే విలక్షణ, సృజనాత్మకత ఉన్న వ్యక్తి ఆయన. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ‘ఈనాడు’ను ప్రారంభించారు. ప్రారంభించిన నాలుగేళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా ‘సితార’ సినీ పత్రిక నిలిచింది.


బహుముఖ ప్రజ్ఞ.. కఠోర సాధన.. ఇవే రామోజీ అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు.. కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాలపాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతుబిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు. మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు.. చైతన్యదీప్తుల్లాంటి చిత్రరాజాలను సృజించారు. అద్భుత ఫిల్మ్‌సిటీని సృష్టించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆఖరి క్షణం వరకూ ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించారు. పనిలోనే విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక సూత్రం. చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించిన మహనీయుడు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ఆయన చెరగని ముద్ర వేశారు. 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను స్థాపించారు. దేశంలోనే అగ్రశ్రేణి చిట్‌ఫండ్స్‌ సంస్థగా మార్గదర్శి నిలిచింది . 60 ఏళ్లలో లక్షలాదిమంది ఖాతాదారులకు నిబద్ధతతో సేవలు అందించారు. ఈ సంస్థ ద్వారా వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించారు.

రామోజీరావు మరణం గురించి తెలుసుకున్న టీడీపీ అధినేత హుటాహుటిన ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకుని రామోజీ పార్దీవదేహంపై పుష్పగుచ్చం ఉంచి, శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రామోజీ కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. భార్య రమాదేవి, కుమారుడు కిరణ్, కోడళ్లు శైలజ, విజయేశ్వరిలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రామోజీ రావు స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తానని ప్రకటన చేశారు.

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మరణంతో కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని ఆయన స్వగ్రామం పెదపారుపూడిలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణ వార్త విని గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామ కూడళ్లలో ‘జోహార్‌ రామోజీరావు’ అంటూ నినాదాలు చేశారు. రామోజీ ఫౌండేషన్‌ సభ్యులు, గ్రామస్థులు ఆయనకు నివాళులర్పించేందుకు హైదరాబాద్‌ బయలుదేరారు.

Share This Article
Leave a comment