విశాఖపట్నంలో చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అత్తపై వ్యక్తిగత కక్షతో కోడలు పథకం ప్రకారం హత్య చేసిన ఘటన బయటపడటంతో ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. 98వ వార్డు, అప్పన్నపాలెం ప్రాంతంలోని వర్షిణి అపార్ట్మెంట్ ఎఫ్ బ్లాక్‌లో నివాసం ఉన్న జయంతి కనకమహాలక్ష్మి (66) శుక్రవారం ఉదయం మంటల్లో చిక్కుకుని అనుమానాస్పదంగా మృతిచెందారు. తొలుత ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని కుటుంబ సభ్యులు చెప్పినా, పోలీసుల దర్యాప్తులో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. పెందుర్తి ఏసీపీ పృథ్వితేజ, సీఐ సతీష్‌కుమార్ శనివారం మీడియాకు వివరాలు తెలియజేశారు.

కనకమహాలక్ష్మి కోడలు లలితకు, ఆమెతో కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. అత్త తనపై భర్తకు చాడీలు చెబుతోందన్న అనుమానం లలితలో తీవ్ర అసహనాన్ని కలిగించింది. ఈ కసితో ఆమె ఎలాగైనా అత్తను హత్య చేయాలని తీర్మానించింది. యూట్యూబ్‌లో ప్రత్యేకంగా ‘How to kill old lady’ అని సెర్చ్ చేసి, ఆ విధానాలను చూసి, ప్లాన్‌ను క్రమంగా సిద్ధం చేసుకుంది. అక్టోబర్ 6న పెట్రోలు కొనుగోలు చేసి ఇంట్లో దాచుకుంది. స్నానం కోసం తల్లి బాత్‌రూంలోకి వెళ్లగానే పిల్లలకు “నానమ్మతో దాగుడుమూతలు ఆడుదాం” అని చెప్పింది. కనకమహాలక్ష్మిని కుర్చీలో కూర్చోబెట్టి ఆమె చేతులు, కాళ్లను తాడు తగిలించింది. కళ్లకు, నోటికి గంతలు కట్టేసి పిల్లలను ఇతర గదుల్లో దాక్కోవాలని పంపించింది. ఇంతలో కనకమహాలక్ష్మిపై పెట్రోలు పోసి నిప్పంటించింది. ఆమె అరుపులు బయటకు వినిపించకుండా టీవీ వాల్యూమ్ బాగా పెంచింది. మంటలు తీవ్రమవడంతో తాడు కాలిపోయి కనకమహాలక్ష్మి దేవుడి గది వైపు పరుగెత్తింది. ఈక్రమంలో పక్కనే ఉన్న మనవరాలికి కూడా మంటలు అంటుకొని గాయాలయ్యాయి. అక్కడికే లలిత తల్లి బయటకు వచ్చేసరికే కనకమహాలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది.
మొదట లలిత దీపం అంటుకొని మంటలు వ్యాపించాయని చెప్పింది. అయితే ఎదురింట్లో ఏసీ పెట్టిస్తున్న వ్యక్తికి మంటలు కనిపించడంతో పరుగున వచ్చి ఆర్పేందుకు ప్రయత్నించగా లలిత అతన్ని అడ్డుకుంది. ఈ అనుమానంతో పోలీసులు విచారణను మరింత గట్టిగా కొనసాగించారు. లలిత ఫోన్‌ను పరిశీలించగా ఆమె ఇటీవల హత్యా పద్ధతులకు సంబంధించిన వీడియోలు చూసిన ఆధారాలు దొరికాయి. దీంతో ఆమెను ప్రశ్నించగా రాత్రి 11.30 గంటలకు నేరాన్ని అంగీకరించింది. కుటుంబ కలహం, అహంకారం, ద్వేషం కలిసి ఒక ప్రాణాన్ని బలితీసుకున్నాయి. హత్యా నేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు లలితను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గాయాలపాలైన మనవరాలికి చికిత్స అందిస్తున్నారు.
