చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అమరావతి పూర్వ వైభవం సంతరించుకుంటోంది. పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చెన్నైలోని ఆస్ట్రేలియన్ కాన్సులేట్‌కు చెందిన ప్రతినిధులు మంగళవారం సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చారు. కాన్సుల్ జనరల్ సిలై జాకీ నేతృత్వంలోని బృందం సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్‌తో సమావేశమయింది. రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు, ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి ప్రదర్శించారు.
ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలకు అమరావతిలో ఉన్న వాణిజ్య అవకాశాలపై సీఆర్డీఏ కమిషనర్‌తో కాన్సుల్ జనరల్ చర్చించారు. రాజధాని ప్రత్యేకతల గురించి కమిషనర్‌ను అడిగి తెలుసుకున్నారు. పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? అమరావతిలో ఏయే రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని ఆరా తీశారు. అమరావతి బృహత్తర ప్రణాళిక, అవకాశాల గురించి కమిషనర్ భాస్కర్ వివరించారు. ఇక్కడ తగినంత భూమి అందుబాటులో ఉందని, పెట్టుబడులు పెట్టొచ్చని, మంచి అవకాశాలు ఉన్నాయని వారికి చెప్పారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తిరిగి సీఎం అయిన తర్వాత ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని స్పష్టం చేయడంతో పాటు పునర్నిర్మాణ పనులు వేగవంతం చేశారు. దీంతో ఇప్పుడు అమరావతి పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, పలు దేశాలు ఇక్కడ పెట్టుబడులకు గల అవకాశాలపై ఆరా తీస్తున్నాయి.