యూనివర్స్ సినిమాలు… ఫ్రాంచైజీలో భాగంగా వచ్చే సినిమాలకి తారల తళుకులు ప్రధానబలం. ఏ సినిమా ఎలా ముగుస్తుందో, కొత్తగా ఎవరి పాత్రలు పరిచయం అవుతాయో ఊహించలేం. ఆ పాత్రలతోనే తర్వాత సినిమాలపై ఆసక్తిని రేకెత్తిస్తుంటారు దర్శకనిర్మాతలు. భారతీయ చిత్ర పరిశ్రమల్లో అత్యంత ప్రేక్షకాదరణ పొందుతూ సాగుతున్న యశ్‌రాజ్ స్పై యూనివర్స్ సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి రూపొందుతుంటాయి. ఆయా సినిమాల్లో అతిథి పాత్రల్లో సందడి చేసే తారలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటారు. యూనివర్స్‌లో భాగంగా తదుపరి రానున్న సినిమాల్లోని పాత్రల్ని కూడా చూచాయగా పరిచయం చేస్తూ ఆసక్తిని రేకెత్తిస్తుంటారు.
ఈ దీపావళికి విడుదల అవుతోన్న ‘టైగర్ 3’ కూడా అతిథి పాత్రల విషయంలో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పఠాన్‌గా షారుక్ ఖాన్, మేజర్ కబీర్ ధలీవాల్ పాత్రలో హృతిక్‌రోషన్ అతిథి పాత్రల్లో తళుక్కున మెరవనున్నారు. ఈ సినిమాతోనే ఎన్టీఆర్‌ని కూడా పరిచయం చేయనున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఈ యూనివర్స్‌లో భాగంగానే రూపొందుతున్న ‘వార్ 2’లో హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ వ్యతిరేక ఛాయలతో కూడిన పాత్రలో సందడి చేయనున్నారు.
‘ఆర్ఆర్ఆర్’తో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులకు చేరువైన ఎన్టీఆర్ ‘వార్-2’కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ‘టైగర్ 3’తోనే ఆయన పాత్రని పరిచయం చేస్తున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది. అది నిజమో కాదో అన్నది తెలియాలంటే ఆదివారం విడుదలవుతున్న సినిమా చూస్తేనే తెలుస్తుంది. మనీష్ శర్మ దర్శకత్వంలో రూపొందిన ‘టైగర్ 3’లో కత్రినాకైఫ్, ఇమ్రాన్ హష్మీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.