Ashwatthama: ఎవరీ అశ్వత్థామ?.. ‘కల్కి’ సినిమాలో అమితాబ్ పాత్రపై డిటైల్డ్ రివ్యూ

Telugu BOX Office

రామాయణ, మహాభారతాలు కేవలం ఇతిహాసాలు కాదు మన చారిత్రక గ్రంథాలు అన్నది హిందువులు బలంగా నమ్మే మాట. రామరావణ యుద్ధం.. కురుక్షేత్ర మహా సంగ్రామం నిజంగా జరిగాయంటూ, ఇదిగో ఆధారాలంటూ ఎంతోమంది చరిత్రకారులు బయటపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇవి కేవలం ఇతిహాసాలు మాత్రమే అంటూ కొట్టిపారేసే నాస్తికులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇది నిజమా? అబద్ధమా అనే వాదనను పక్కన పెడితే మంచిని పంచే, ధర్మాన్ని పెంచే ప్రతి గ్రంథమూ ఆచరణీయమే అనేది ముమ్మాటికీ నిజం.

ఈనాటి ఇన్‌స్టాగ్రామ్ యుగంలో ఎంతమంది పిల్లలకి రామాయణం, మహాభారతం గురించి తెలుసు? అసలు ఎంతమంది తల్లిదండ్రులు వారికి నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు? అనేది పెద్ద కొశ్చన్ మార్క్. కానీ మనం చేయని ఈ మంచి పనిని ఇటీవలి కాలంలో సినిమాలు చేస్తున్నాయి. మొన్న వచ్చిన ‘హను మేన్’ సినిమా దీనికి చక్కటి ఉదాహరణ.

సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఆ మ్యాన్, ఈ మ్యాన్, హీ మ్యాన్ అంటూ హాలీవుడ్ హీరోల వెంట పరిగెత్తే మన పిల్లలతో ‘జై హనుమాన్’ అనిపించింది ‘హను మేన్’ చిత్రం. మోడ్రన్ ఆలోచనలకి పురాణాలు లింక్ చేస్తూ సరికొత్తగా ఈ సినిమాని తీర్చిదిద్దాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పుడు అదే పని మరో యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా చేశారు.

మహాభారతంలోని పాత్రలను నేటి కలియుగానికి లింక్ చేస్తూ ‘కల్కి 2898 AD’ అనే ఓ సరికొత్త ప్రపంచాన్ని నాగ్ అశ్విన్ సృష్టించారు. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో కీలకమైన అశ్వత్థామ పాత్రను బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ పోషించారు. మరి అసలు ఈ అశ్వత్థామ ఎవరు?

పాండవులు-కౌరవుల గురువైన ద్రోణాచార్యుడి తనయుడే ఈ అశ్వత్థామ. కురుక్షేత్ర మహా సంగ్రామంలో అశ్వత్థామ పోరాటం గురించి ఎంతో గొప్పగా వర్ణించారు. 64 కళల్లో ప్రావీణ్యుడైన అశ్వత్థామ ఆ యుద్ధంలో కౌరవుల తరఫున పాండవులపై అలుపెరుగని యుద్ధం చేశాడు. కానీ యుద్ధంలో పాండవులు గెలిచిన తర్వాత ఆగ్రహంతో ఓ పెద్ద తప్పు చేస్తాడు. పాండవులను అంతం చేసేందుకు బయలుదేరిన అశ్వత్థామ వారి కుమారులైన ఉపపాండవులను నిద్దట్లోనే గొంతుకోసి చంపేస్తాడు. ఇంతటి దుర్మార్గాన్ని చేసినందుకు అశ్వత్థామను కృష్ణుడు శపిస్తాడు.

నీకు మృత్యువంటే భయం లేదు కదా అశ్వత్థామ? నీ నుంచి నీ మృత్యువును నేను తీసేసుకుంటున్నాను.. నువ్వు అమరుడివి అవ్వాలని నేను నిన్ను శపిస్తున్నాను.. నీ శరీరంలోని అణువణువు రగులుతుంది. శరీరంలోని ప్రతి అణువు నుంచి చీము, రక్తము స్రవిస్తాయి. నిన్ను సమీపించే సాహసం ఎవరూ చేయరు అశ్వత్థామ.. ఏకాకివై కాలాంతం వరకూ పృథ్విలోని కొండల్లో, కోనల్లో అలమటిస్తూ ఉంటావు. ప్రతి క్షణం మృత్యువుకై పరితపిస్తూ ఉంటావ్. అయినప్పటికీ నీకు మృత్యువనేది ప్రాప్తించదు.. అంటూ కృష్ణుడు శపించడంతో అశ్వత్థామ అమరుడైపోతాడు.

పురాణాల ప్రకారం ఇప్పటికీ అశ్వత్థామ చిరంజీవిగా ఈ భూమిపైనే తిరుగుతూ ఉన్నాడని నమ్ముతారు. అయితే మరి అశ్వత్థామకి కల్కికి లింక్ ఏంటి? అనే ప్రశ్నకి కూడా కల్కి పురాణంలో సమాధానముంది. కానీ, ఈ కల్కి సినిమాలో అశ్వత్థామ.. కల్కి మధ్య కథను దర్శకుడు నాగ్ అశ్విన్ ఎలా నడిపిస్తారో చూడాలి.

Share This Article
Leave a comment