తెలుగు సినీ యవనికపై కొత్త ప్రయోగాలకు, సాహసోపేతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు సూపర్ స్టార్ కృష్ణ. తొలి తెలుగు కౌబాయ్ మూవీ ‘మోసగాళ్లకు మోసగాడు’, రంగుల్లో మొదటి సినిమాస్కోప్ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ వంటి ట్రెండ్ సెట్టర్ల తర్వాత ఆయన సాధించిన మరో అసాధారణమైన అద్భుతం ‘సింహాసనం’. నేటి కాలంలో ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి పాన్-ఇండియన్ చిత్రాలను రూపొందించడానికి దర్శకులకు ఏళ్లకు ఏళ్లు సమయం పడుతోంది. కానీ అప్పట్లోనే దాదాపు రూ. 3.2 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ జానపద దృశ్యకావ్యాన్ని కృష్ణ కేవలం 53 రోజుల్లోనే పూర్తి చేసి అందరినీ విస్తుపోయేలా చేశారు.
అగ్ర హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, ఇందులో విక్రమ సింహుడు, ఆదిత్యవర్ధనుడు అనే రెండు భిన్నమైన పాత్రలు పోషించడంతో పాటు దర్శకత్వం, ఎడిటింగ్ బాధ్యతలను కూడా ఆయనే స్వయంగా నిర్వహించడం విశేషం. సాధారణ చిత్రాల బడ్జెట్ రూ. 40 – 50 లక్షలు మాత్రమే ఉండే రోజుల్లో, అంత పెద్ద మొత్తం వెచ్చించి తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తొలి 70mm చిత్రంగా దీనిని నిర్మించారు. నేటి సాంకేతిక ప్రమాణాల ప్రకారం ఈ స్థాయి చిత్రాన్ని తెరకెక్కించాలంటే రూ. 200 కోట్ల బడ్జెట్, ఐదేళ్ల సమయం పడుతుందని విశ్లేషకులు భావిస్తారు.

1977లో వచ్చిన ‘పాడిపంటలు’ తర్వాత ఒక భారీ జానపద చిత్రం తీయాలనే ఆలోచన కృష్ణకు ఉన్నప్పటికీ, శ్రేయోభిలాషుల సూచనలతో కొన్నాళ్లు వాయిదా వేశారు. ఆ తర్వాత పద్మాలయ స్టూడియోస్‌లో ట్రయల్ బేసిస్‌గా హిందీలో జితేంద్ర, జయప్రదల కాంబినేషన్‌లో నిర్మించిన ‘పాతాళభైరవి’ ఉత్తరాదిన ఘనవిజయం సాధించడంతో ‘సింహాసనం’ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ఈ చిత్రానికి మహారధి కథాంశాన్ని సమకూర్చగా, నటీనటుల విషయంలో కృష్ణ రాజీ పడలేదు. అలకనందాదేవిగా జయప్రద, రాజనర్తకి జస్వంతిగా రాధా, విషకన్యగా మందాకిని నటించారు. ‘రామ్ తేరీ గంగా మైలీ’ ఫేమ్ మందాకిని, బాలీవుడ్ విలన్ అంజాద్ ఖాన్ నటించిన తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. వహీదా రెహమాన్ రాజమాతగా నటించగా, ఆమెకు ప్రముఖ నటి షావుకారు జానకి డబ్బింగ్ చెప్పారు.
3.5 ఎకరాల్లో భారీ సెట్స్
ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ భాస్కరరాజు పర్యవేక్షణలో దాదాపు 3.5 ఎకరాల విస్తీర్ణంలో రూ. 45 లక్షల వ్యయంతో అత్యంత వైభవంగా ఉండే సెట్స్ నిర్మించారు. 400 మంది కార్మికులు 45 రోజుల పాటు రాత్రింబవళ్లు శ్రమించి ఈ సెట్లను తీర్చిదిద్దారు. ప్రసిద్ధ బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరి స్వరపరిచిన తొలి తెలుగు చిత్రం ఇది. ఆయన అందించిన స్వరాలు, ముఖ్యంగా రాజ్-సీతారాం పాడిన “ఆకాశంలో ఒక తార నాకోసం వచ్చింది ఈ వేళ” పాట నేటికీ మారుమోగుతూనే ఉంటుంది.
బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ!
కృష్ణ 235వ చిత్రంగా 1986 మార్చి 21న విడుదలైన ‘సింహాసనం’, 86 ప్రింట్లతో అత్యధిక థియేటర్లలో విడుదలైన తొలి తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. హిందీ వెర్షన్ ‘సింఘాసన్’ 125 ప్రింట్లతో విడుదలైంది. మొదటి వారంలోనే ఏకంగా 1, 51, 65,291 రూపాయలు వసూలు చేసి ఆల్ టైమ్ స్టేట్ రికార్డు నెలకొల్పింది. హైదరాబాద్ దేవి థియేటర్‌లో రోజుకి 4 ఆటలతో 105 రోజులు, వైజాగ్ చిత్రాలయలో 100 రోజులు ప్రదర్శించబడింది. ఈ చిత్ర శతదినోత్సవ వేడుకలు 1986 జూలై 12న చెన్నైలోని వీజీపీ గార్డెన్స్‌లో దాసరి నారాయణరావు అధ్యక్షతన, సూపర్‌స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా అత్యంత వైభవంగా జరిగాయి. ‘సింహాసనం’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, తెలుగు సినిమా సత్తాను దేశవ్యాప్తంగా చాటిచెప్పిన ఒక అద్భుత దృశ్యకావ్యంగా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.
