టాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్‌తో జనాల్ని ఆకట్టుకుంటోన్న పేరు రామ్ పోతినేని. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబంలో పుట్టినా — సేఫ్ జోన్లో కాకుండా, కొత్త కథలు, కొత్త ప్రయోగాలతో తనకంటూ వేరు మార్క్ ఏర్పరచుకున్న హీరో. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’తో మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్న రామ్, తన జీవితంలోని కొన్ని వ్యక్తిగత సంగతులను పంచుకున్నారు.

బాల్యంలోనే మొదలైన సినిమా కల
రామ్ హైదరాబాదులో పుట్టినా, చిన్ననాటి కాలం మొత్తాన్ని విజయవాడ, చెన్నైల్లో గడిపాడు. పెదనాన్న స్రవంతి రవికిశోర్ ప్రముఖ నిర్మాత కావడంతో ఇంట్లో ఎప్పుడూ సినిమా టాపిక్స్ ఉండేవి. ఈ వాతావరణం రామ్‌లో చిన్నప్పుడే నటనా ఆసక్తిని రేపిందట. ఎనిమిదేళ్లకే “నేను హీరో అవుతాను” అంటూ అమ్మ దగ్గర చెప్పి, యాక్టింగ్ స్కూల్‌కి కూడా వెళ్లాడు. ఒక వైపు చదువు, మరోవైపు డాన్స్, మార్షల్ ఆర్ట్స్ అన్నీ నేర్చుకుంటూ హీరో అవ్వడానికి కావాల్సిన స్కిల్స్‌ని చిన్నప్పుడే సంపాదించాడు.
షార్ట్ ఫిల్మ్ నుంచి స్టార్ హీరోకు
యూట్యూబ్ అంతగా తెలిసిన రోజులే కాదు. అప్పుడే రామ్ ఒక షార్ట్ ఫిల్మ్‌లో నటించాడు. ఆ ఫిల్మ్ అంత ప్రభావం చూపడంతో అది యూరప్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. అక్కడ రామ్ నటనకు అవార్డు కూడా వచ్చింది. తమిళంలో తొలి అవకాశం చూద్దామని అనుకున్నప్పటికీ, వైవీఎస్ చౌదరి వల్ల15 ఏళ్ల వయసులోనే ‘దేవదాసు’తో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యాడు. మొదటి సినిమానే పెద్ద హిట్ కావడంతో రామ్ కెరీర్‌కు బలమైన పునాది పడింది.
ఒకే రాత్రిలో కుటుంబం కిందికి… మళ్లీ పైకి
విజయవాడలో ఉన్నప్పుడు వారి కుటుంబం ఆర్థికంగా చాలా బాగానే ఉండేదట. కానీ కొన్ని సంఘటనల కారణంగా ఒకే రాత్రిలో ఆస్తులన్నీ పోయాయి. అప్పుడు చెన్నైకి మారి అక్కడి నుంచి తిరిగి మొదలుపెట్టాల్సి వచ్చింది. చిన్ననాటి బొమ్మలకే ప్రత్యేక గది ఉండే స్థితి నుంచి, మొత్తం ఇంటి పరిమాణం కూడా తగ్గిపోయింది. ఆ పరిస్థితుల్లోనూ రామ్ తండ్రి కష్టపడి కుటుంబాన్ని మళ్లీ నిలబెట్టాడు. ఈ సంఘటన రామ్‌కు జీవితంలో పెద్ద పాఠమైందట.
‘ఆంధ్ర కింగ్ తాలూకా’లో లిరిక్ రైటర్‌గా రామ్
ఈ సినిమా రామ్‌కు ప్రత్యేకం అయిపోయే మరో కారణం — అందులోని ‘నువ్వుంటే చాలు’ పాటకు లిరిక్స్ ఆయనే రాశాడు. సరదాగా రాసిన ఆ పాట విడుదలైన తర్వాత యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి రావడంతో రామ్ కూడా ఆశ్చర్యపోయాడట.
రియల్ లైఫ్‌లో రామ్ — రజనీ ఫ్యాన్, స్టైల్‌కింగ్
చెన్నైలో పెరిగిన రామ్‌కు రజనీకాంత్‌పై ప్రత్యేక అభిమానముంది. అలాగే జెనీలియా–రితేశ్లతో మంచి వ్యక్తిగత బంధం ఉంది. పుస్తకాలు చదవడం కన్నా వాటి గురించి చర్చించడం ఇష్టపడతాడట. జీవితం కూడా సినిమాల్లానే కొత్తగా ఉండాలని భావించే రామ్ — వ్యాయామం నుంచి డిన్నర్ వరకు ప్రతీరోజూ కొత్తగా ఏదో ప్రయత్నిస్తాడు. కార్లు, ఫోన్లు కూడా రెగ్యులర్‌గా మార్చుకుంటూ ఉండే టైప్.
స్టైలిస్ట్ ఎవరు? — “నేనే!”
సోషల్ మీడియాలో, ఫిల్మ్ ఫంక్షన్లలో రామ్ కనిపించే స్టైలిష్ లుక్స్ చూసి చాలామంది ఆయన స్టైలిస్ట్ ఎవరో అడుగుతుంటారు. కానీ రామ్ చెబుతున్నది ఒక్కటే — “నాకే స్టైలిస్ట్ అంటూ ఎవరూ లేరు. నన్ను నేనే మేకోవర్ చేసుకుంటా.”
