తెలుగు సినీ పరిశ్రమంలో కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరైన అగ్ర హీరో విక్టరీ వెంకటేశ్. అప్పట్లో ఆయన చాలా సినిమాలు మహిళా ప్రేక్షకులను దృష్టి పెట్టుకునే తీసేవారు. ఒకవైపు అందరినీ ఆకట్టుకునేలా సినిమాలు చేస్తూనే, విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగారు. అలా వెంకటేశ్ నటించిన విభిన్న కథా చిత్రం ‘పవిత్రబంధం’. విదేశాల్లో పెరిగిన ఓ యువకుడికి జీవితం, ప్రేమ అంటే ఏమిటో తెలియజెప్పిన సినిమా ఇది. ఇందులో విజయ్ (వెంకటేశ్)కు పెళ్లి, సంసారం ఇవేమీ నచ్చవు. తండ్రి విశ్వనాథ్ (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) పోరు పడలేక రాధ (సౌందర్య) అనే యువతిని పెళ్లి చేసుకుంటాడు. అది కూడా కాంట్రాక్ట్ మ్యారేజ్. ఏడాది తర్వాత ఎవరి దారి వారిది. కుటుంబ పరిస్థితుల వల్ల విజయ్ పెట్టిన షరతుకు ఒప్పుకొని రాధ కాంట్రాక్ట్ వివాహాన్ని అంగీకరిస్తుంది. ఈ ఏడాది కాలంలో విజయ్‌లో ఎటువంటి మార్పు వచ్చిందనేది మిగిలిన కథ.
ఇటువంటి సబ్జెక్ట్ చేయడం నిజంగా రిస్కే. కానీ, వైవిధ్యమైన పాత్రలను కోరుకొనే వెంకటేశ్ కథ విన్న వెంటనే అంగీకరించి చేయడం విశేషం. ఈ సినిమాలో ఫస్ట్ నైట్ సీన్లో సౌందర్య వెంకటేశ్ కాళ్లకు నమస్కరిస్తుంది. ఆమె పైకి లేవగానే వెంకటేశ్ కూడా కిందకు వంగి ఆమె కాళ్లకు నమస్కరిస్తాడు. ఇదే స్టిల్ 24 షీట్ పోస్టర్ వేస్తే అది వైరల్ అయింది.
ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో సూపర్ హిట్ అయింది. అంతేకాదు వెంకటేష్, సౌందర్యకు హిట్ ఫెయిర్‌గా పేరు తెచ్చింది. ఇక ఈ సినిమాను ఒరియా, కన్నడ, హిందీ, బెంగాలీ బంగ్లాదేశ్, తమిళ్, బెంగాలీ.. ఇలా ఆరు భాషల్లోకి రీమేక్ చేస్తే అక్కడ కూడా హిట్టే. తెలుగులో ఉత్తమ సినిమాగా ‘పవిత్ర బంధం’ చిత్రానికి బంగారు నంది దక్కింది. ఉత్తమ నటిగా సౌందర్య, ఉత్తమ సహాయనటుడిగా ఎస్పీబీకి నంది అవార్డులు తీసుకువచ్చింది.