కళావాచస్పతి.. కంచు కంఠం.. రాజకీయ వేత్త.. సాహిత్యకారుడు.. సినీ నటుడు.. ఇలా పాత్రలు వేరు కావచ్చు.. కానీ, మనిషి ఒక్కడే. ఆయనే బహుముఖ ప్రజ్ఞాశాలి జగ్గయ్య. న్యూస్ రీడర్‌గా జీవితాన్ని ప్రారంభించి, నటుడిగా మారి, వెండితెరపై ఎన్నో విజయవంతమైన పాత్రలను పోషించారు. విలక్షణ నటుడిగా ఆయనకు గుర్తింపు తెచ్చింది ఆయన గొంతే. ‘‘మనం’ అనే భావన మనందరిలో ఉన్నప్పుడే ఈ దేశం ముందుకుపోతుంది’’ అని పలు వేదికలపై అంటుండేవారాయన.
జగ్గయ్య బాగా బిజీగా ఉన్న రోజుల్లో రాత్రి, పగలూ షూటింగ్లలో పాల్గొనేవారు. దాదాపు మూడు షిఫ్ట్‌ల్లో పనిచేసేవారు. ఒకసారి ఆయన ఒప్పుకొన్న చిత్రాల షూటింగ్‌లన్నీ పూర్తవడంతో విరామం దొరికింది. అప్పటికే అలసిపోయిన జగ్గయ్య తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నారు. అప్పుడు ఇంట్లో వాళ్లకి ఇలా చెప్పారట.
‘‘నేను ఈ తెల్లవారుజామున వచ్చాను. పడుకొని నిద్రపోతాను. నన్ను ఎవరూ లేపకండి. తలుపు దగ్గరగా వెయ్యండి. అప్పుడప్పుడూ వచ్చి చూస్తూ ఉండండి. నేను లేవకపోతే, భోజనానికనీ, టిఫిన్కనీ లేపొద్దు. నేనే లేచి వచ్చి తింటాను’’ అని పడుకొని నిద్రపోయారు. అలా చెప్పిన జగ్గయ్య రెండు రాత్రులు, రెండు పగళ్లూ నిద్రపోయారు. మధ్యలో దేనికీ లేవలేదట. ఆ తర్వాత డాక్టర్ వద్దకు వెళ్తే, ‘48గంటలపై చిలుకు అతి గాఢంగా నిద్రపోవడమన్నది నేనెక్కడా వినలేదు. ఆ విశ్రాంతి మంచిదే’ అని అన్నారట.