అప్పుడు తండ్రితో.. ఇప్పుడు కొడుకుతో.. రామ్ చరణ్ సినిమాలో లేడీ సూపర్‌స్టార్?

Telugu BOX Office

చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా తిరుగులేని స్టార్‌డమ్‌తో దూసుకుపోతోంది లేడీ సూపర్‌స్టార్ నయనతార. కెరీర్ ఆరంభంలో చిన్న పాత్రలు, సెకండ్ హీరోయిన్ రోల్స్ చేసినప్పటికీ.. తన నటన, గ్లామర్‌తో అతి త్వరగా అగ్ర కథానాయికగా ఎదిగింది. రజినీకాంత్ ‘చంద్రముఖి’, సూర్య ‘గజినీ’ వంటి చిత్రాల్లో సెకండ్ లీడ్‌గా కనిపించినా, ఆ తర్వాత మెయిన్ హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఏలేసింది. ప్రస్తుతం కమర్షియల్ చిత్రాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ కథలను భుజాన వేసుకుని నడిపిస్తున్న నయన్.. మార్కెట్‌లో స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుంది.

పారితోషికంతో సరికొత్త రికార్డ్

ఇటీవలే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన సినిమాతో టాలీవుడ్‌లో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది నయనతార. ఈ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో సౌత్ ఇండస్ట్రీలో ఆమె డిమాండ్ మరింత పెరిగింది. ప్రస్తుతం ఆమె ఒక్కో ప్రాజెక్ట్‌కు ఏకంగా రూ. 25 కోట్ల నుంచి రూ. 30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. భారతీయ సినిమా రంగంలో ఒక కథానాయిక ఈ స్థాయి రెమ్యునరేషన్ అందుకోవడం సంచలనంగా మారింది.

 

చరణ్ – సుకుమార్ కాంబోలో ల్యాండ్ మార్క్ రోల్?

ఇదిలా ఉంటే ఇప్పుడు నయన్ మరో భారీ క్రేజీ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో సరికొత్త చిత్రం పట్టాలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఒక అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్ర కోసం నయనతారను సంప్రదించినట్లు సమాచారం. ఫిల్మ్‌నగర్ గుసగుసల ప్రకారం.. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు అక్క పాత్రలో నయనతార కనిపించనుందని టాక్. కథను మలుపు తిప్పే అత్యంత బలమైన పాత్ర కావడంతో, నయన్ అయితేనే పూర్తి న్యాయం చేయగలదని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నారట. గతంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి పలు చిత్రాల్లో జోడీ కట్టిన నయన్.. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో భాగం కానుండటం మెగా అభిమానులకు సైతం ఆసక్తిని కలిగిస్తోంది. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Share This Article
Leave a Comment