కొత్తదనాన్ని.. వైవిధ్యతను ఆస్వాదించే అభిరుచి.. అభిలాష తెలుగు ప్రేక్షకుల సొంతం. ఈ రోజున మన సినిమాలకు దేశ విదేశాల్లోనూ బ్రహ్మరథం పడుతున్నారంటే కారణం వాళ్లే.. అన్నారు హీరో నందమూరి బాలకృష్ణ. ఆయన శనివారం రాత్రి హైదరాబాద్లో జరిగిన ‘స్కంద’ చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రామ్ పోతినేని కథానాయకుడిగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమే ‘స్కంద’. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. శ్రీలీల కథానాయిక. సయీ మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ థండర్ వేడుకలో చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజుల్లో సినిమా అంటే ఎలా ఉండాలి.. ప్రేక్షకుల్ని ఎలా థియేటర్లకు రప్పించాలి అన్న విషయంపై దర్శక నిర్మాతలు దృష్టి పెట్టాలి. రామ్ తెలంగాణ నేపథ్యంలో ‘ఇస్మార్ట్ శంకర్’ చేసి నాకొక సవాల్ విసిరాడు. ఇప్పుడు నేను అదే నేపథ్యంలో ‘భగవంత్ కేసరి’ చేశాను. నేనింకా పాస్ అవ్వాల్సి ఉంది. నేను.. బోయపాటి కలిసి ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ లాంటి విజయవంతమైన చిత్రాలు చేశాం. ఇప్పుడు రామ్ – బోయపాటి కలయికలో వస్తున్న ‘స్కంద’ పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా. ‘దేవదాస్’ నుంచి రామ్ ప్రయాణాన్ని చూస్తున్నా. విభిన్న నేపథ్యమున్న కథలు, పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. తెలుగు కళామతల్లి ఇచ్చిన వరం రామ్. అందం.. అభినయం.. నాట్యం.. అన్ని కలగలిసిన మంచి నటి శ్రీలీల. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు కనులవిందు చేస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు.