Balakrishna Shooting Injury: నటసింహం, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిమానులను తీవ్ర ఆందోళనలోకి నెట్టే సంఘటన మంగళవారం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కతున్న ఆయన 111వ చిత్రం (#NBK111) చిత్రీకరణ సందర్భంగా బాలయ్య గాయపడ్డారు. కాకినాడ పోర్ట్ పరిసరాల్లో మంచు మనోజ్, బాలకృష్ణల మధ్య ఒక భారీ యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం షూటింగ్‌ను నిలిపివేసి, ఆయనకు స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం కాకినాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి స్కానింగ్ నిర్వహించారు. అనంతరం మెరుగైన వైద్యం, ప్రత్యేక పరీక్షల కోసం రాజమండ్రి నుంచి ఆయన్ను ప్రత్యేక ఎయిర్‌లిఫ్ట్ ద్వారా హైదరాబాద్‌లోని ఏఐజీ (AIG) ఆసుపత్రికి తరలించారు.

హెల్త్ బులెటిన్ విడుదల
బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఏఐజీ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసి అభిమానులకు ఊరటనిచ్చే తీపి కబురు అందించారు. బాలయ్య ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, కంగారు పడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.
బులిటెన్‌లోని ముఖ్యాంశాలు:
- ప్రాథమిక పరీక్షల నివేదిక: బాలకృష్ణ ఎడమ మోకాలి భాగంలో కణజాలాల వద్ద రక్తం గడ్డకట్టడంతో పాటు వాపు ఉన్నట్లు డయాగ్నస్టిక్ పరీక్షల్లో తేలింది. ఇది కండరం పట్టేయడం లేదా దెబ్బతినడం (మజిల్ టేర్) అయి ఉండవచ్చని ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం అభిప్రాయపడింది.
- ప్రత్యేక వైద్య బృందం: ఆయన గత వైద్య చరిత్రను దృష్టిలో ఉంచుకుని, సురక్షితమైన చికిత్సను అందించేందుకు వివిధ విభాగాలకు చెందిన నిపుణులతో ఒక మల్టీడిసిప్లినరీ వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు.
- తుది చికిత్స ప్రణాళిక: ప్రస్తుతం ఆయన ఆర్థోపెడిక్ నిపుణుల నిరంతర పర్యవేక్షణలో క్లినికల్ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ పరీక్షలన్నీ పూర్తయిన తర్వాతే తుది చికిత్స విధానాన్ని ఖరారు చేయనున్నట్లు వైద్యులు వెల్లడించారు.
విశ్రాంతికి వైద్యుల సూచన
పరీక్షల అనంతరం బాలకృష్ణకు కొన్ని రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో #NBK111 షూటింగ్‌కు తాత్కాలికంగా విరామం పడింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో #NBK112 చిత్రాన్ని బాలయ్య పట్టాలెక్కించనున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటసింహం త్వరగా కోలుకుని, మళ్లీ పవర్ ఫుల్ మాస్ లుక్‌లో సెట్స్‌పైకి రావాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
