మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ‘పగ పగ పగ’.. బాగుంది ఓ లుక్కేయండి

Telugu BOX Office

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ప్రతినాయకుడిగా నటించిన ‘పగ పగ పగ’ చిత్రం మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. 2022 సెప్టెంబరు 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం స్టార్స్ ఎవరూ లేకపోవడం, కథాకథనాలు ఓ మాదిరిగా ఉండేసరికి ఈ చిత్రంపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇన్నాళ్లకు ఆహా ఓటీటీ దీన్ని కొనుగోలు చేయడంతో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సత్యనారాయణ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. మిగతా చిత్రాలకు భిన్నంగా ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రేక్షకులందరికీ ఉచితంగా చూపిస్తామని నిర్మాతలు ప్రకటన చేయడం అప్పట్లో వైరల్‌గా మారింది. కంటెంట్‌పై నమ్మకంతో నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయం సినిమాపై ఆసక్తిని పెంచింది.

‘పగపగపగ’ సినిమా కథ 1985, 1990, 2006వ సంవత్సరాల కాలంలో సాగుతుంది. బెజవాడలోని బెజ్జోనిపేటకు చెందిన జగ్గుభాయ్‌(కోటి), కృష్ణ(బెనర్జీ) కాంట్రాక్ట్‌ కిల్లర్స్‌. ఒక్కసారి డీల్‌ కుదుర్చుకుంటే ప్రాణాలు పోయినా పూర్తి చేయడం వీరి స్పెషాలిటీ. అయితే కృష్ట పోలీసు హత్య కేసులో అరెస్ట్‌ అవుతాడు. ఆ సమయంలో జగ్గూభాయ్‌కి కూతురు సిరి (దీపిక ఆరాధ్య) పుడుతుంది. కృష్ణ ఫ్యామిలీని కంటికి రెప్పలా కాపాడుతానని మాట ఇచ్చిన జగ్గు.. అతను జైలుకు వెళ్లగానే ఆ ఊరి నుంచి పారిపోతాడు. తర్వాత హత్యలను చేయడం మానేసి జగదీష్‌ ప్రసాద్‌గా పేరు మార్చుకొని పెద్ద వ్యాపారవేత్తగా మారతాడు. మరోవైపు కృష్ణ ఫ్యామిలీ మాత్రం కష్టాలు పడుతూనే ఉంటుంది. అతని కొడుకు అభి(అభిలాష్‌)ని చదువులో రాణిస్తాడు. అభి చదువుకునే కాలేజీలోనే సిరి చేరుతుంది. ఈ క్రమంలోనే ఇద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమించుకుంటారు. జగదీష్‌ మాత్రం వీరి పెళ్లికి నిరాకరిస్తాడు. దీంతో ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకుంటారు. తను గారాబంగా పెంచుకున్న కూతురిని తీసుకెళ్లిన అభిపై జగదీష్‌ పగ పెంచుకుంటాడు. అల్లుడిని చంపడానికి ఓ ముఠాతో డీల్‌ కుదుర్చుకుంటాడు. కానీ కూతురు ప్రెగ్నెన్సీ అని తెలిసి ఆ డీల్‌ని వద్దనుకుంటాడు. ఇంతలోపే ఆ డీల్‌ చేతులు మారి చివరకు బెజ్జోనిపేటకు చెందిన ఓ వ్యక్తికి చేరుతుంది. అసలు ఆ డీల్‌ తీసుకుంది ఎవరు? తన అల్లుడిని కాపాడుకోవడానికి జగదీష్‌ చేసిన ప్రయత్నం ఏంటి? అభి తండ్రి కృష్ణ చివరకు ఏం చేశాడు? అభి ప్రాణాలను ఎవరు రక్షించారు? అనేదే మిగతా కథ.

కెరీర్‌లో మొదటిసారి విలన్‌ పాత్ర పోషించాడు సంగీత దర్శకుడు కోటి జగ్గూ అలియాస్‌ జగదీష్‌ ప్రసాద్‌ పాత్రకు తగిన న్యాయం చేశాడు. విలన్‌గా, హీరోయిన్‌కి తండ్రిగా నటనలో అదరగొట్టేశాడు. హీరో అభిలాష్‌కి ఇది తొలి సినిమా అయినప్పటికీ చక్కగా నటించాడు. సీరియస్‌, కామెడీ సీన్స్‌తో పాటు యాక్షన్‌ ఎడిసోడ్స్‌లోనూ అదరగొట్టేశాడు. హీరోయిన్‌గా సిరి పాత్రలో దీపిక మెప్పించింది. బెనర్జీ, కరాటే కళ్యాణి, జీవా తదితరులు తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. కోటి సంగీతం ఈ సినిమాకు ప్లస్‌ అయింది. తనదైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. నవీన్ కుమార్ చల్లా సినిమాటోగ్రఫీ, పాపారావు ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా మెప్పించకపోయినా చిన్న చిత్రాలు తీసే వారికి మాత్రం ఎంతో నమ్మకాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది.

ఈ చిత్రానికి సంబంధించి డైరెక్టర్ డైరెక్టర్ రవి శ్రీ దుర్గా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దశాబ్దానికి పైగా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న ఆయన స్టార్ డైరెక్టర్ల దగ్గర పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఓ కథ రాసుకుని దాన్ని అనుకున్నది అనుకున్నట్లుగా తెరపైన చూపించేందుకు కష్టపడ్డారు. కరోనా సమయంలో కేవలం 50 లక్షల రూపాయల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. మరే నిర్మాత అయినా కాస్త బడ్జెట్ ఫ్రీడమ్ ఇస్తే ఇంతకుమించి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కిస్తానన్న నమ్మకం ఇండస్ట్రీకి కలిగించాడు.

Share This Article
Leave a Comment