‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్‌తో చేద్దామనుకున్నారు – మోహన్‌బాబు

Telugu BOX Office

‘‘కన్నప్ప కేవలం భక్తి చిత్రం మాత్రమే కాదు. ఇది ఓ చరిత్ర. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. ఆయన ఆశీసులతోనే మేమీ సినిమా తీశాం. ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు. మంచు విష్ణు టైటిల్‌ పాత్రలో ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమే ‘కన్నప్ప’. మోహన్‌బాబు నిర్మించారు. ప్రీతి ముకుందన్‌ కథానాయిక. ప్రభాస్, అక్షయ్‌ కుమార్, శరత్‌కుమార్, మోహన్‌లాల్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. శివనామ స్మరణతో మొదలై ఆ నామస్మరణతోనే ముగిసిన టీజర్‌ ఆద్యంతం అలరించింది. తిన్నడు పాత్రలో విష్ణు పరిచయమైన తీరు.. యుద్ధ ఘట్టాల్లో ఆయన చేసిన సాహసాలు.. ఆఖర్లో అతిథి పాత్రల్లో ప్రభాస్, అక్షయ్‌ కుమార్‌లు తళుక్కుమనడం.. సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి.

ఈ సందర్భంగా హీరో మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘‘ఇది నా కలల సినిమా. నా బిడ్డతో సమానం. ఒక నటుడిగా ఈ చిత్రం నాకు గౌరవాన్ని పెంచుతుంది. కెరీర్‌ పరంగా నా జీవితాన్ని మార్చేస్తుంది. ఈ సినిమా కోసం ఇండస్ట్రీలోని చాలా మంది నాకు సాయం చేశారు. ఇందులో చాలా మంది అగ్ర నటీనటులు ఉన్నారు. వాళ్లందరితో కలిసి నటించడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. భక్తుడు కాక ముందు కన్నప్ప ఎలా ఉండేవారో అలా నటించడం సవాల్‌గా అనిపించింది. మంచి చిత్రం చేయాలనే లక్ష్యంతో బడ్జెట్‌ విషయంలో రాజీ పడకుండా దీన్ని నిర్మించాం. ఈ సినిమాలో ప్రభాస్‌కు అందరితోనూ కాంబినేషన్‌ సీన్స్‌ ఉంటాయి. వచ్చే నెల నుంచి ప్రతి సోమవారం ఒక అప్‌డేట్‌ ఇస్తాం. అందరూ మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు.

మంచు మోహన్‌బాబు మాట్లాడుతూ.. ‘‘కృష్ణంరాజు, ప్రభాస్‌తో ఈ సినిమా తీయాలని అనుకున్నారు. స్క్రిప్ట్‌ కూడా సిద్ధం చేసుకున్నారు. నేను విష్ణుతో తీయాలని అనుకుంటున్నా అని చెప్పగానే ఆ స్క్రిప్ట్‌ నాకు ఇచ్చారు. విష్ణు కూడా ప్రభాస్‌తో సమానమన్నారు. ఇది ప్రజల సినిమా. ఏ తరానికైనా కొత్తగా అనిపించే చిత్రమిది. ఇందులో దేశంలోని గొప్ప నటీనటులందరూ భాగమయ్యారు. వారంతా అద్భుతంగా నటించారు. దీనికి ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు. సీనియర్ నటి మాట్లాడుతూ.. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందంగా, గర్వంగా ఉందన్నారు.

Share This Article
Leave a comment