జులై చివరి వారంలో హరిహర వీరమల్లు, కింగ్డమ్ వంటి పెద్ద సినిమాలు రీసెంట్గా విడుదల కాగా ఈ సినిమాల కన్నా కూడా మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన తొలి చిత్రం ‘మహావతార్ నరసింహ’ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పౌరాణిక యానిమేటెడ్ ప్రాజెక్ట్‌ను రూపొందించింది. పూర్తి స్థాయిలో యానిమేషన్‌తో రూపొందిన ఈ సినిమా థియేటర్లలోకి ఎలాంటి హైప్ లేకుండానే సైలెంట్‌గా అడుగుపెట్టినా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇది ప్రమోషన్లు, స్పెషల్ ఈవెంట్లు లేకుండానే నేరుగా థియేటర్లలో రిలీజైనా ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు రావడంతో, మౌత్ టాక్ ద్వారా క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇతర భాషలతో పోలిస్తే హిందీ వెర్షన్‌కు నార్త్ ఇండియాలో విపరీతమైన స్పందన లభిస్తోంది. భారీ సంఖ్యలో స్క్రీన్లు కేటాయించడంతో పాటు, నాన్-హాలీడే రోజుల్లో కూడా మంచి ఆక్యుపెన్సీ నమోదు అవుతోంది. తెలుగులోనూ అదే స్థాయిలో అనూహ్యంగా ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది.

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై వచ్చిన ఈ సినిమా 8 రోజుల్లోనే రూ.60.5 కోట్లు వసూళ్లను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమాగా రికార్డు నెలకొల్పిందని ప్రకటించింది. ఇండియాతో పాటు అమెరికాలోనూ ఈ చిత్రం అపూర్వ ఆదరణతో దూసుకెళ్తోందని తెలిపిందే. యూఎస్‌లో వన్ మిలియన్ డాలర్ల క్లబ్లో చేరినట్లు వెల్లడించింది. ఈ ప్రదర్శనతో పెద్ద సినిమాలకు కూడా ఇది ఒక విధంగా ఛాలెంజ్ విసురుతోందని సినీ వర్గాలు అంటున్నారు. ఇదే దూకుడుతో వెళ్తే రెండు వారాల్లోనే రూ.100 కోట్లు దాటేసినా ఆశ్చర్యం అక్కర్లేదని అభిప్రాయపడుతున్నారు.
‘మహావతార్ నరసింహ’ ఈ సినిమాటిక్ యూనివర్స్‌లో తొలి చిత్రం కాగా, హోంబలే ఫిల్మ్స్ ఇప్పటికే మొత్తం ఏడుపాటు చిత్రాలు ఉంటాయని ప్రకటించింది. మొదటి సినిమా ఘన విజయం సాధించడంతో మిగతా ప్రాజెక్టులకు బలమైన పునాదిని వేసినట్లయ్యింది. దర్శకుడు అశ్విన్ కుమార్ విజన్‌కు మంచి టెక్నికల్ బలం తోడు కావడంతో సినిమా మంచి విజయం సాధించింది.. హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించాయి. అంచనాలు లేకుండానే విడుదలై భారీ విజయాన్ని సాధించిన ‘మహావతార్ నరసింహ’ భారతీయ యానిమేటెడ్ సినిమాల ట్రెండ్‌ను మార్చే దిశగా సాగుతోంది. దీని స్ఫూర్తితో మరికొన్ని సంస్థలు కూడా పురాణ ఇతిహాసాల్లోని కథలను యానిమేషన్ రూపంలో తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నారు.
