ప్రశాంత్ వర్మ – తేజ సజ్జ కాంబినేషన్లో తెరకెక్కిన ‘హనుమాన్’ సినిమా టాలీవుడ్లో ఎన్ని సంచనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్ సాధించింది. ఇందులో భాగమైన అందరికి ఒక మరపురాని సూపర్ హిట్ అందించింది. ఇక ఈ సినిమాకి భారీ లాభాలను ఆర్జించడమే కాదు రికార్డు స్థాయిలో భారీ వసూళ్లతో పాటు హీరోగా తేజ సజ్జాకి, యువ దర్శకుడిగా ప్రశాంత్ వర్మ సామర్థ్యం మీద చాలా ప్రశంసలు అందించింది.
రూ.30 కోట్ల బిజనెస్ జరుపుకున్న ఈ చిత్రం ఏకంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి ఆల్-టైమ్ అత్యధిక సంక్రాంతి గ్రాసర్‌గా… అలాగే టాలీవుడ్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా చివరిలో జై హనుమాన్ అని సీక్వెల్ అనౌన్స్ చేసి ఆ సినిమాను ఉన్నత స్థాయిలో ముగించారు. ‘జై హనుమాన్’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో మూవీ లవర్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అయోధ్య ప్రాణ ప్రతిష్ట రోజే సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయని దర్శకుడు ప్రశాంత్ వర్మ అధికారికంగా ప్రకటించాడు, అందుకే ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని అభిమానులు -ప్రేక్షకులు అంచనా వేశారు. అయితే ఈ విషయంలోనే తేజ సజ్జా బాడ్ న్యూస్ చెప్పారు. తాజాగా మీడియా ఇంటరాక్షన్‌లో తేజ ఈ విషయం మీద కొంత క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమాకి చాలా సమయం పడుతుందని చెప్పారు. ఎక్కువ సమయం ఉండడంతో ఈ గ్యాప్‌లో మరికొన్ని సినిమాలు చేస్తానని అన్నారు.
‘జై హనుమాన్’ భారీస్థాయి సినిమా కావడంతో 2025లో విడుదల సాధ్యం కాదని తేజ సజ్జ స్పష్టం చేశాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉండగా, హనుమాన్ పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఇప్పుడు 2026లో ప్రేక్షకుల ముందుకు రానుందని అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సీక్వెల్లో తేజ సజ్జా మళ్లీ హనుమంతు పాత్రలోనే కనిపించనున్నాడు.