69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో.. తెలుగు సినిమా దుమ్మురేపింది. అవార్డుల్లో ఏకంగా పది పురస్కారాలు తెలుగు సినిమాలకు దక్కాయి. అందులో ట్రిపుల్ ఆర్ సినిమాకే ఆరు అవార్డులు దక్కడం విశేషం. పుష్ప సినిమాతో… పాన్ ఇండియా స్టార్‌గా మారిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు.. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. దీంతో తెలుగు సినిమా చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పొందిన యాక్టర్‌గా బన్నీ నిలిచాడు. ఇక ఉత్తమ నటి అవార్డును అలియా భట్ , కృతిసనన్ పంచుకున్నారు. ఉత్తమ చిత్రంగా రాకెట్రీ నిలిచింది.
మరోవైపు జాతీయ అవార్డుల్లో పది అవార్డులు తెలుగు సినిమాలకే దక్కాయి. పుష్ప సినిమాలో నటనకు గానూ ఉత్తమ నటుడిగా అల్లుఅర్జున్ ఎంపికయ్యాడు. పుష్ప సినిమా పాటలతో దేశాన్ని ఓ ఊపేసిన దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు.
బెస్ట్ పాపులర్ మూవీగా రాజమౌళి.. ట్రిపుల్ ఆర్ సినిమా నిలిచింది. ఆ సినిమాలో కొమరం భీముడో పాటపాడిన సింగర్ కాలభైరవ.. ఉత్తమ గాయకుడి అవార్డు గెలుపొందారు. వీటితో పాటు బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ స్టంట్ మాస్టర్ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ అవార్డులు కైవసం చేసుకుంది. మొత్తంగా ఆరు అవార్డులను ట్రిపుల్ ఆర్ తన ఖాతాలో వేసుకుంది.
మరోవైపు ఉత్తమ రచయితగా కొండపొలం సినిమాలో పాటలు రాసిన చంద్రబోస్ ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నిలవగా.. బెస్ట్ క్రిటిక్ కేటగిరిలో పురుషోత్తమచార్యులుకు అవార్డు దక్కింది.