తొలి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్.. బాలయ్య ఫ్యాన్స్‌కి థ్యాంక్స్

Telugu BOX Office

 

‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరో వైవిద్యభరితమైన చిత్రం ‘డాకు మహారాజ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ‘డాకు మహారాజ్’ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘డాకు మహారాజ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది.

భారీ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రానికి మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. బాలకృష్ణను దర్శకుడు బాబీ కొత్తగా చూపించారని, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమాని రూపొందించారని, ముఖ్యంగా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు ప్రేక్షకులు. ‘డాకు మహారాజ్’ సినిమాకి వస్తున్న స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం.. అభిమానులకు, ప్రేక్షకులను కృతజ్ఞతలు తెలిపింది.

దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ, “తెలుగు ప్రేక్షకులు అందరికీ పేరు పేరునా మా టీం తరపున థాంక్స్ చెబుతున్నాము. రెండేళ్ళ క్రితం ఒక ఆలోచనతో ఈ ప్రయాణం, ఈ సంక్రాంతి కానుకగా మీ ముందుకు వచ్చింది. బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వాలని టీమ్ అందరం ఎంతో కష్టపడ్డాం. బాలకృష్ణ గారి కెరీర్లో గొప్ప సినిమాల్లో ఒకటిగా ‘డాకు మహారాజ్’ నిలుస్తుందని గతంలో ఒక ప్రెస్ మీట్ సందర్భంగా నాగవంశీ గారు అన్నారు. ఆయన ఈ సినిమాని ఎంతో నమ్మారు. వంశీ గారి నమ్మకం నిజమై ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. 2023 సంక్రాంతి వాల్తేరు వీరయ్యతో విజయాన్ని అందుకున్నాను. ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’తో వచ్చాను. సంక్రాంతి అనేది నాకు మరింత ప్రత్యేకమైన పండుగలా మారిపోయింది. తమన్ కావచ్చు, విజయ్ కార్తీక్ కావచ్చు.. అద్భుతమైన టీమ్ వల్లే ఈ అవుట్ పుట్ వచ్చిందని చెప్పవచ్చు. తమన్ సంగీతం సినిమాకి మెయిన్ పిల్లర్లలో ఒకటిగా నిలిచింది. అలాగే విజయ్ కార్తీక్ విజువల్స్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఎడిటర్లు నిరంజన్ గారు, రూబెన్ గారు, ఫైట్ మాస్టర్ వెంకట్ గారు, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారు ఇలా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా పని చేశారు. బాలకృష్ణ గారికి వీరాభిమాని అయిన నాగవంశీ గారు ఒక గొప్ప సినిమాని తీయాలనే ఉద్దేశంతో నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ప్రేక్షకులు థియేటర్ లో సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మనం మనసు పెట్టి సినిమా తీస్తే, తెలుగు ప్రేక్షకులు దానిని గుండెల్లోకి తీసుకుంటారని మరోసారి రుజువైంది. సినిమాకి వస్తున్న స్పందన పట్ల బాలకృష్ణ గారు చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చి ఫ్రీడమ్‌తో పాటు అడిగివన్నీ సమకూర్చి, ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించిన నాగవంశీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు” అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “తిరుమల ఘటన నేపథ్యంలో అనంతపురంలో తలపెట్టిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని రద్దు చేశాం. అందుకే ఈ వారంలో సక్సెస్ మీట్‌ని అనంతపురంలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాం. అన్ని వర్గాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమా పట్ల బాలకృష్ణ గారి అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. సాధారణ ప్రేక్షకులు కూడా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. పండగ సీజన్ కూడా కావడంతో ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతుందనే నమ్మకం ఉంది” అన్నారు.

కథానాయిక ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ, “ఇది నాకు చాలా ప్రత్యేకమైన మరియు ఎప్పటికీ మరచిపోలేని పుట్టినరోజు. నా పుట్టినరోజు నాడు విడుదలైన డాకు మహారాజ్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇంత మంచి సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నా. నాకు అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు, చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అందరూ కుటుంబంతో కలిసి థియేటర్లలో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు” అన్నారు.

కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ, “ఈ సంక్రాంతి మాకు మరచిపోలేని బహుమతి ఇచ్చింది. టీమ్ అంతా ఎంతో సంతోషంగా ఉన్నాము. ప్రేక్షకులతో కలిసి ఈ సినిమా చూశాము. ఇప్పటి వరకు నేను ఇలాంటి ఎక్స్ పీరియన్స్ చూడలేదు. ముఖ్యంగా బాలయ్య బాబు గారి అభిమానులకు ధన్యవాదాలు. సినిమాని అందరూ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు నా జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు” అన్నారు.

నటి ఊర్వశి రౌతేలా మాట్లాడుతూ.. “ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తున్న సందర్భంగా దర్శకుడు బాబీ గారికి, టీమ్ అందరికీ కంగ్రాట్స్. ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చిన బాబీ గారికి థాంక్స్. నాగవంశీ గారు ఫైర్ బ్రాండ్ ప్రొడ్యూసర్. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. లెజెండరీ బాలకృష్ణ గారితో పని చేయడం అనేది వరల్డ్ క్లాస్ ఎక్స్ పీరియన్స్. డాకు మహారాజ్ చిత్రంపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు చాలా ఆనందంగా ఉంది” అన్నారు.

Share This Article
Leave a comment