Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ సినిమా ఎందుకు చూడాలి? 10 ఆసక్తికర కారణాలు

Telugu BOX Office

ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమా కల్కి 2898 ఏడీ. తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ భారత దేశం ఇప్పుడు ఈ సినిమాను ఆసక్తిగా గమనిస్తోంది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ‘మహానటి’ సినిమాతో సక్సెస్ సాధించిన నాగ్ అశ్విన్.. ఈసారి భారీ బడ్జెట్, దిగ్గజ నటులు, కథాకథనంతో ముందుకొచ్చారు. పురాణాలను భవిష్యత్‌తో లింక్ చేస్తూ ఈ కథను రూపొందించారు. కల్కి సినిమా బడ్జెట్ 600 కోట్ల రూపాయలు దాటింది. భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన సినిమా ఇదేనని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా పూర్తవడానికి నాలుగేళ్ల కంటే ఎక్కువ సమయం పట్టింది.

హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా సన్నివేశాలు, వీఎఫ్‌ఎక్స్ ఉండనున్నాయి. సెట్స్ కోసం భారీగా ఖర్చు చేశారు. ఒక్క ప్రభాస్‌ ఉపయోగించే వాహనం ‘బుజ్జి’ కోసమే 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ టీమ్‌తో పాటు, కోయంబత్తూరులోని జయం ఆటో ఇంజినీరింగ్ ఈ సూపర్ కారును రూపొందించారు. ప్రేక్షకులకు హై క్వాలిటీ చిత్రాన్ని అందించే ఉద్దేశంతో భారీగా ఖర్చు చేసినట్లు మూవీ టీమ్ తెలిపింది. ఇక కల్కి విశేషాల గురించి వస్తే..

ఈ సినిమా కథ మూడు ప్రపంచాల మధ్య సాగుతుంది. భూ ప్రపంచమంతా వనరులను కోల్పోయి, నిర్జీవమైన దశలో ‘కాశీ’ పట్టణాన్ని చూపించారు. అన్ని వనరులు ఉండే ఆకాశం కోసం.. కిలోమీటర పరిధిలో కాంప్లెక్స్‌ను డిజైన్‌ చేశారు. సర్వమతాలకు చెందిన శరణార్థులు ఉండే ప్రపంచంగా శంబలను చూపించారు. వీటి అవుట్‌ లుక్‌ మొత్తం వీఎఫ్‌ఎక్స్‌‌లో చూపించారు. ఇందుకోసం 700 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ ఉపయోగించారని తెలుస్తోంది.

ప్రైమ్‌ఫోకస్‌, డీఎన్‌ఈజీ, ది ఎంబసీ విజువల్ ఎఫెక్ట్స్‌ తదితర దిగ్గజ సంస్థలు ‘కల్కి’ సినిమా కోసం పనిచేశాయి. హాలీవుడ్‌‌లో హ్యారీపోటర్‌, ఇంటర్‌స్టెల్లర్‌, డ్యూన్‌, బ్లేడ్‌ రన్నర్‌ లాంటి సినిమాలకు పనిచేసిన టీమ్‌ ‘కల్కి’ కోసం పనిచేసింది.

ఇక ఈ సినిమాకు ‘కల్కి 2898 ఏడీ’ అని టైటిల్‌ పెట్టడం వెనుక అద్భుతమైన లాజిక్‌ ఉంది. మూవీ ట్రైలర్‌‌ను గమనిస్తే.. ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘6 వేల సంవత్సరాల కిందట కనిపించింది.. ఇప్పుడు ఆ పవర్‌ వచ్చిందంటే’ అంటాడు. 2898 నుంచి 6 వేల సంవత్సరాలను తీసేస్తే వచ్చేది 3102. ఇది కృష్ణ పరమాత్మ అవతారం ముగించిన సంవత్సరం. అంటే 2898 ఏడీలో మళ్లీ శ్రీమహావిష్ణువు ‘కల్కి’గా అవతరించబోతున్నాడని అర్థం.

ఈ 6 వేల సంవత్సరాల్లో జరిగిన పరిమాణాలను కూడా టైమ్‌ ట్రావెల్‌ రూపంలో సినిమాలో చూపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన కల్కి థీమ్‌లో చూపించిన శ్రీమహావిష్ణువు అవతారాలు, చంద్రబోస్ అందించిన సాహిత్యం అద్భుతంగా ఉన్నాయి.

కల్కిలో అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌, సుప్రీం యాస్కిన్‌గా విలన్ పాత్రలో కమల్‌హాసన్‌ నటిస్తున్నారు. వీరిద్దరూ 40 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నారు. 1985లో వచ్చిన ‘గిరాఫ్తార్’ సినిమాలో అమితాబ్, కమల్ హాసన్ కలిసి నటించారు. ఆ సినిమాలో రజినీకాంత్‌ కూడా నటించారు.

కమల్‌హాసన్‌ ‘సుప్రీం యాస్కిన్‌’ పాత్ర లుక్‌ కోసం అనేక టెస్ట్‌లు చేశారు. చివరకు లాస్‌ ఏంజిల్స్ వెళ్లి, హాలీవుడ్‌ సినిమాలకు పనిచేసే మేకప్‌ నిపుణులతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.

అశ్వత్థామ పాత్రలో నటిస్తున్న అమితాబ్‌ వయసు 81 ఏళ్లు. కల్కి టీమ్‌లో అత్యధిక వయసు కలిగిన వ్యక్తి ఆయనే. అశ్వత్థామ మేకప్‌ వేయడానికి 3 గంటల సమయం పడితే, తీయడానికి 2 గంటలు పట్టేదట. అంతేకాదు, ఆ వయసులో యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం అమితాబ్‌ చాలా కష్టపడ్డారు.

బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్రాలతో విశేష గుర్తింపు తెచ్చుకున్న దీపికా పదుకొణె.. నేరుగా తెలుగులో నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం మరో విశేషం. అంతేకాదు.. అలనాటి అందాల తార శోభన దాదాపు 18 ఏళ్ల తర్వాత చేస్తున్న తెలుగు సినిమా ఇది. ‘మరియం’ పాత్రలో శోభన కనిపించనుంది.

ఈ సినిమాలో కొన్ని సర్‌ప్రైజ్‌లు కూడా ఉన్నాయి. నాని, దుల్కర్‌ సల్మాన్‌, మృణాళ్‌ ఠాకూర్‌ లాంటి కొందరు యువ నటులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. అలనాటి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కూడా ఈ సినిమా కోసం పనిచేశారు. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌‌కు విలువైన సలహాలు, సూచనలు అందించారు.

పాన్‌ ఇండియా మూవీగా వస్తున్న ‘కల్కి’ పలు ఫార్మాట్‌లలో విడుదలవుతోంది. 2D, 3D, IMAX, 4DX లోనూ విడుదల చేస్తున్నారు. విదేశాల్లో 4DXలో విడుదలవుతున్న తొలి తెలుగు సినిమా ‘కల్కి’ కావడం విశేషం. ఈ సినిమా కోసం ‘ఐ మ్యాక్స్‌ డిజిటల్‌ కెమెరా’ను ఉపయోగించారు. యారి అలెక్స్‌ 65, యారి డీఎన్‌ఏ లెన్స్‌ను ఉపయోగించి 6.5K రిజల్యూషన్‌లో సినిమా తీయడం వల్ల ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌కు అప్‌ స్కేలింగ్‌ సులభమైంది. దీని వల్ల పిక్చర్‌ క్వాలిటీ చాలా స్పష్టంగా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. ఈ టెక్నాలజీని వాడి తీసిన తొలి ఇండియన్ సినిమా ఇదే.

Share This Article
Leave a comment