‘పార్ట్‌టైమ్‌ కొలువు’లపై నిఘా.. అమెరికాలో భారతీయ విద్యార్థుల పాట్లు

Telugu BOX Office

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రాకతో అక్కడున్న భారతీయ విద్యార్థులను కష్టాలు చుట్టుముట్టాయి. ఒకవైపు రూపాయితో పోలిస్తే అమెరికా డాలర్‌ విలువ రోజురోజుకు పెరిగిపోతూ భయపెడుతుండగా… మరోవైపు చదువుకుంటున్న క్యాంపస్‌ బయట పార్ట్‌టైమ్‌ కొలువులు చేసుకోలేని పరిస్థితి తలెత్తడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు సోదాలు చేస్తూ కఠినంగా వ్యవహరిస్తుండటంతో.. తమపైనా నిఘా పెట్టారని భావిస్తున్న విద్యార్థులు పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలను మానేస్తున్నారు.

నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
నిబంధనల ప్రకారం ఎఫ్‌-1 వీసాపై అమెరికాలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు తమ విద్యాసంస్థలో వారానికి 20 గంటల చొప్పున ‘ఆన్‌ క్యాంపస్‌’ జాబ్‌ పేరిట పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసుకోవచ్చు. వేసవి సెలవులు, సెమిస్టర్ల మధ్య వ్యవధిలో వారానికి 40 గంటలు పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చదువుకుంటూ ప్రాంగణం బయట మాత్రం పార్ట్‌టైమ్‌ కొలువు చేయడానికి వీల్లేదు. అయితే అందరికీ క్యాంపస్‌లో కొలువులు దొరకవు. ఈ నేపథ్యంలో మన విద్యార్థులు ఎక్కువగా క్యాంపస్‌ బయట పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. సూపర్‌ మార్కెట్లు, పెట్రోల్‌ బంకులు, హోటళ్లు తదితరాల్లో స్థానికులు పనిచేస్తే గంటకు 20-30 డాలర్లు ఇవ్వాలి.

భారతీయ విద్యార్థులైతే గంటకు 6 నుంచి 10 డాలర్లు ఇచ్చినా పనిచేస్తారు. అందుకే ఆయా వ్యాపార యజమానులు మన వారికి అవకాశం ఇస్తుంటారు. ఆ మొత్తంతో విద్యార్థులు జీవన వ్యయంతోపాటు ఫీజులు కూడా చెల్లిస్తూ తల్లిదండ్రులపై ఆర్థికభారం లేకుండా చూసుకుంటున్నారు. ఈ కొలువులు నిబంధనలకు విరుద్ధం కావడంతో.. ఇలాంటి వారిని, అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించేందుకు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. వారికి దొరికితే వీసా రద్దు చేసి స్వదేశానికి పంపిస్తారు. ఇదే జరిగితే మళ్లీ జీవితంలో అమెరికా వెళ్లలేని పరిస్థితి వస్తుందని భయపడుతున్న భారతీయ విద్యార్థులు వేల మంది పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు మానేస్తున్నారు. కొన్ని నెలల తర్వాత పరిస్థితి సర్దుకుంటుందని ఆశాభావంతో ఉన్నారు. అప్పటివరకు నెలవారీ ఇంటి అద్దె, భోజనం తదితర ఖర్చులకు నగదు పంపాలని భారత్‌లో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి కోరుతున్నారు. ప్రాంతాలను బట్టి విద్యార్థులకు నెలకు జీవన వ్యయం రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు.

అంతటా మనవాళ్లే
అమెరికా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ‘ఓపెన్‌ డోర్‌’ నివేదిక ప్రకారం 2023-24లో అక్కడి అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్‌దే ప్రథమ స్థానం. అమెరికాలో 11.26 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉండగా… అందులో భారతీయ విద్యార్థులు 3.30 లక్షల మంది ఉన్నారు. అంటే ప్రతి 100 మంది అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు 30 మంది మనవారే. వారిలో తెలుగు రాష్ట్రాల వారే 56% మంది ఉన్నారు.

ఏప్రిల్‌ వరకే కష్టకాలం?
‘ఓ హోటల్‌లో 10 మంది సిబ్బంది ఉంటే అందులో ఏడెనిమిది మంది ఇలా నిబంధనలకు విరుద్ధంగా పార్ట్‌టైమ్‌ చేసేవాళ్లే. ఇప్పుడు ఒకేసారి వారందరూ మానేస్తే వ్యాపారాలు దెబ్బతింటాయి. దీనిపై నిర్వాహకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఒకవేళ రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేస్తే స్థానికులకు ఇబ్బంది అవుతుంది. ‘సంపాదించు… ఖర్చు చేయి’ తరహా ఆర్థిక విధానం అమెరికావాసులది. ఇంట్లో వండుకోవడం తక్కువ. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ వరకు మాత్రమే పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించవచ్చు. ఆ తర్వాత పరిస్థితిలో మార్పువచ్చే అవకాశం ఉంది’ అని వరల్డ్‌ వైడ్‌ ఎడ్యు కన్సల్టెంట్స్‌ ఎండీ వీఆర్‌ ఉడుముల అభిప్రాయపడ్డారు.

Share This Article
Leave a comment