‘ప్రతి మనిషి వారానికి కనీసం 150 నిమిషాలైనా వ్యాయామం చేయాలని అన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సూచిస్తోంది. కానీ మన భారతీయుల్లో యాభై శాతానికిపైగా అలా చేయరట. అందువల్లే- ఇక్కడ హృద్రోగ సమస్యలు ఎక్కువంటారు. 150 నిమిషాలని లెక్కపెట్టు కోలేకపోవడం, రోజుకి 30 నిమిషాలని ప్రత్యేకంగా కేటాయించకపోవడం ఇందుకో కారణమని చెబుతుంటారు వైద్యులు. అలాంటివాళ్ళకి రోజూ మన అడుగుల్ని లెక్కపెట్టే మొబైల్ ఆప్‌లు ఉపయోగపడతాయనీ సలహా ఇస్తుంటారు.
‘నిజంగానే వీటివల్ల ఆ ఉపయోగం ఉందా?’ అని తేల్చేందుకు అమెరికాలోని ఎంఐటీకి చెందిన పరిశోధకురాలు శివాంగి బాజ్‌పాయ్ నడుంబిగించారు. ఇండియా సహా 42 దేశాలకి చెందిన 20 వేలమందికి సంబంధించిన వ్యాయామం వివరాల్ని పరిశీలించారు. రోజూ ఆరు నుంచి 9 వేల అడుగులు నడిచేవాళ్ళలో హృద్రోగ సమస్యలు 60 శాతానికి తగ్గినట్టు తేల్చారు. భారతీయులు ఉద్యోగ విరమణ తీసుకున్నాక శారీరక శ్రమకి దూరమవుతున్నారనీ అలాంటివాళ్ళు ఇలా అడుగులు లెక్కేసుకుంటే ఎన్నో రుగ్మతలకి దూరంగా ఉండొచ్చనీ చెబుతున్నారు.