భారతీయుల ఆహారంలో నాన్ వెజ్‌కు ఉన్న స్థానం ప్రత్యేకం. అందులోనూ చికెన్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆదివారం వస్తుందంటే చాలామంది ముందుగానే చికెన్ తీసుకురావాలని ప్లాన్ చేస్తారు. అయితే చికెన్‌లోనూ రెండు రకాలున్నాయి—నాటుకోడి, బ్రాయిలర్ కోడి. ఇవి రెండూ చాలామంది తింటున్నప్పటికీ, ఆరోగ్యానికి ఏది మంచిదో అనే సందేహం ఎప్పటినుంచో ప్రజల్లో ఉంది. నాటుకోడి సహజసిద్ధంగా పెరిగే కోడి. ఇది పచ్చిక, చిన్న పురుగులు, గింజలు, విత్తనాలు తింటూ నెమ్మదిగా ఎదుగుతుంది. ఒక నాటుకోడి పెరిగేందుకు నాలుగు నుండి ఆరు నెలల సమయం పడుతుంది. ఈ సహజ పెరుగుదల వల్ల నాటుకోడి మాంసం కండరాలు బలంగా, కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. రుచి కూడా సహజంగా, గట్టిగా ఉంటుంది.

బ్రాయిలర్ కోడి మాత్రం పూర్తిగా భిన్నం. ఫార్ముల్లో వీటిని అతి వేగంగా పెంచేందుకు ప్రత్యేక ఆహారం, మందులు, యాంటీబయోటిక్స్ ఇస్తారు. కేవలం ఐదు నుండి తొమ్మిది వారాల్లో బ్రాయిలర్ కోడి అమ్మకానికి సిద్ధమవుతుంది. ఈ వేగవంతమైన పెంపకం వల్ల మాంసం నాణ్యత తగ్గిపోతుంది. ఇందులో కొవ్వు అధికంగా, పోషకాలు తక్కువగా ఉండటం వల్ల ఆరోగ్య ప్రయోజనం కూడా పెద్దగా ఉండదు. నాటుకోడి మాంసం మాత్రం సహజంగా పెరిగినందున రోగనిరోధక శక్తిని పెంచే జింక్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు తగ్గుతాయి. అలాగే ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత తగ్గుతుంది. శరీరానికి శక్తి పెరుగుతుంది.
అంతేకాక నాటుకోడి మాంసంలో విటమిన్ B12 కూడా మంచి స్థాయిలో ఉంటుంది. ఇది నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మెడ, భుజం వంటి ప్రాంతాల్లో నొప్పులు తగ్గుతాయి. శక్తి స్థాయిలు పెరుగుతాయి. కండరాల నిర్మాణానికి అత్యవసరమైన ప్రోటీన్ నాటుకోడిలో ప్రీమియం క్వాలిటీగా ఉంటుంది కాబట్టి శారీరక శ్రమ చేసే వారికి, వ్యాయామం చేసే వారికి ఇది చాలా మంచిది. ఇంకా నాటుకోడి మాంసంలో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు సహజంగా ఉంటాయి. ఇవి గుండె వ్యాధులను దూరంగా ఉంచుతాయి. శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల రిస్క్‌ను కూడా తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.
ధర విషయానికి వస్తే నాటుకోడి మాంసం బ్రాయిలర్ కంటే కొంచెం ఎక్కువే. కానీ ఆరోగ్య పరంగా వినియోగదారుల లాభం దృష్టిలో ఉంచుకుంటే నాటుకోడివైపు మొగ్గు చూపడమే మేలు. బ్రాయిలర్ కోడి తక్కువ ధరకు లభించినా, అందులోని పోషకాలు తగ్గిపోవడం, యాంటీబయోటిక్స్ అవశేషాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హాని కలగొచ్చు. అందుకే పోషక నిపుణులు సాధ్యమైనంతవరకు నాటుకోడి మాంసాన్నే తీసుకోవాలని సూచిస్తున్నారు. సహజంగా పెరిగిన నాటుకోడి శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలను సమతౌల్యంగా అందించడమే కాకుండా, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
