చాలామంది పొద్దున్నే లేవాలని అలారం పెట్టుకుంటారు. అది సమయానికి మోగినా లేవాలని అనిపించదు. కళ్లు మూతలు పడుతుంటాయి. అలారం కట్టేసి తిరిగి పడుకుంటారు. మళ్లీ కాసేపటికి అలారం మోగుతుంది. తిరిగి కట్టేస్తాం, పడుకుంటాం. అలా నిద్ర, మెలకువతో తంటాలు పడుతూ.. పావుగంటకో, అరగంటకో తప్పనిసరి పరిస్థితుల్లో చివరికి మంచం మీద నుంచి దిగుతాం. తరచూ చాలామంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటారు.
నిజానికి తొందరగా నిద్ర లేవటం మంచి అలవాటే అయినా అందరికీ, అన్నిసార్లూ కుదరకపోవచ్చు. ముఖ్యంగా రాత్రిపూట ఆలస్యంగా నిద్రించేవారికిది పెద్ద సమస్యే. ఒకవేళ గత్యంతరం లేక లేచినా కొంత సేపటి వరకూ నిద్రమత్తుతో సతమతమవుతూనే ఉంటారు. పొద్దున్నే లేవనందుకు తమను తాము నిందించుకుంటుంటారు కూడా. ఇకపై అలా చింతించాల్సిన పనిలేదని స్వీడన్ తాజా అధ్యయనం చెబుతోంది. ఉదయం పూట మెలకువ వచ్చాక వెంటనే కాకుండా కునుకు తీసినట్టు కాసేపు పడుకొని లేవటం మంచిదేనని.. ఇది చురుకుగా, స్పష్టంగా ఆలోచించటానికి తోడ్పడుతుందని పేర్కొంటోంది. ముఖ్యంగా రాత్రిపూట ఆలస్యంగా పడుకునేవారికిది బాగా ఉపయోగపడుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు.
సాధారణంగా ఉదయం అలారాన్ని కట్టేసే అలవాటు చిన్న వయసువారిలో, ఆలస్యంగా నిద్రించేవారిలో ఎక్కువ. వీరిలో చాలామంది లేచాక కనీసం గంట సేపైనా నిద్రమత్తుతో జోగుతుంటారు. కాసేపు అలాగే పడుకొని, లేస్తే హుషారుగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అలారం మళ్లీ మళ్లీ మళ్లీ మోగటం వల్ల నిద్ర నాణ్యత తగ్గినప్పటికీ కార్టిజోల్ హార్మోన్ మోతాదులు, మూడ్ మీద పెద్దగా ప్రభావం చూపకపోవటం గమనార్హం. పైగా ఆలోచన సామర్థ్యమూ పెరుగుతున్నట్టు బయటపడింది. అలాగని అలారాన్ని మాటిమాటికి కట్టేస్తూ ఎక్కువసేపు పడుకుంటామని అనుకుంటున్నారేమో. ఇదీ ప్రమాదమే. ఏదో అరగంట సేపైతే ఏమో గానీ ఎక్కువసేపు అలాగే మంచం మీద దొర్లితే మాత్రం ప్రమాదమే. దీంతో లాభాల కన్నా నష్టాలే ఎక్కువని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మాటిమాటికీ అలారం కట్టేస్తూ ఎక్కువసేపు అలాగే పడుకుంటే నిద్రకు భంగం కలిగినట్టుగానే శరీరం భావిస్తుంది. ఇది రకరకాల అనర్థాలకు దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.