బోగి మంటలు ఎందుకు వేస్తారు.. ఈ పండగ విశిష్టత ఏంటి?

Telugu BOX Office

 

హిందూ మత విశ్వాసాల ప్రకారం, సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని ‘మకర సంక్రాంతి’ అంటారు. ఈ పండుగకు సరిగ్గా ఒక రోజు ముందు ‘భోగి’ పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి 13 జనవరి 2025 సోమవారం నాడు వచ్చింది. ఈ పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడులోనూ ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. అదే విధంగా చిన్నారులపై భోగి పళ్లను పోస్తారు. ఈ పవిత్రమైన రోజున ఇంద్రుడు, వరుణ దేవుడిని పూజిస్తారు. వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటారు. భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మలకొలువును కూడా జరుపుతారు. ఈ సందర్భంగా భోగి పండుగ వేళ తెల్లవారుజామునే ఎందుకు మంటలు వేస్తారు.. అసలు భోగికి ఆ పేరేలా వచ్చింది.. దీని వెనుక ఉన్న కారణాలు, కథనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

శాస్త్రీయ కారణాల ప్రకారం, సూర్యుడు దక్షిణయానం కాలంలో భూమికి దూరంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధలను తప్పించుకునేందుకు, దక్షిణా యానంలో తాము పడిన కష్టాలు, బాధలను తట్టుకున్నందుకు.. ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు. భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం, శ్రీ రంగనాథ స్వామిలో గోదా దేవి లీనమై భోగాన్ని పొందిందని.. దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెబుతారు.

మరో కథనం ప్రకారం.. శ్రీ మహా విష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే. ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు. అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజని… అందుకే ఈరోజు భోగి పండుగను జరుపుకుంటారు.

భోగి అంటే సుఖం, ఆనందం. సంక్రాంతి పర్వదినాల ప్రారంభంగా జరుపుకునే ఈ పండుగ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. భోగి రోజున పాత బట్టలు, చెత్త, పాడైన వస్తువులను భోగి మంటలో వేయడం ఆనవాయితీ. ఇది పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరాన్ని స్వాగతించడం వంటిది. భోగి మంటలో పాత వస్తువులను వేయడం వల్ల ఇల్లు శుభ్రంగా మారి, కొత్త శక్తిని పొందుతుందని నమ్మకం. ఇది కొత్త సంవత్సరానికి ఆరంభానికి ప్రతీక. జనవరి మాసంలోచలి అధికంగా ఉండడం వలన చలిని తప్పించుకోవడం కోసం కూడా ఈ బోగి వేస్తుంటారు అని కొందరి నమ్మకం. భోగి మంటలో వేసే పిడకలు సాధారణంగా ఆవు పేడతో తయారు చేస్తారు. ఇది పంటలకు మేలు చేస్తుందని నమ్మకం. భోగి మంటలో వేయడం ద్వారా చెడు పోతుందని.. మంచి జరుగుతుందని నమ్ముతారు. భోగి రోజున కొన్ని ప్రాంతాల్లో గొబ్బెమ్మలు, ముగ్గులు వేయడం, సంక్రాంతికి కావాల్సిన పనులు మొదలు పెట్టడం వంటి ఆచారాలు ఉన్నాయి. భోగి పండుగ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది మన సంస్కృతి, ఆచారాలకు అద్దం పడుతుంది. పల్లెలు పట్టణాల్లో ఆనందాలు తెచ్చే పండుగ భోగి అని పెద్దలు చెబుతుంటారు.

Share This Article
Leave a comment