మాస్ పాత్రలతో ఉర్రూతలూగించే మాస్ మహారాజా రవితేజ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను హృద్యంగా ఆవిష్కరించే దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదలకు రంగం సిద్ధమవుతున్న వేళ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాను వీక్షించి ‘U/A’ సర్టిఫికెట్ కేటాయించారు. మొత్తం నిడివి 2 గంటల 25 నిమిషాలుగా ఖరారైంది. ల్యాగ్ లేకుండా, కథను సూటిగా, వేగంగా నడిపించేలా ఈ సమయాన్ని లాక్ చేసినట్లు తెలుస్తోంది.

సెన్సార్ వర్గాల నుంచి వస్తున్న టాక్ ప్రకారం.. ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోనుంది.
నటనలో విశ్వరూపం: కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా, ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా రవితేజ తన నటనలోని భావోద్వేగ కోణాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఆయన కెరీర్లో ఇదొక ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని అంటున్నారు. కూతురి పాత్ర పోషించిన బేబీ నక్షత్ర అమాయకత్వం, నటన సన్నివేశాలకు ప్రాణం పోశాయి.
ఆయువుపట్టుగా సెకండ్ హాఫ్: సినిమా ప్రథమార్ధం చాలా ఆహ్లాదకరంగా సాగితే, ఇంటర్వెల్ నుంచి మొదలయ్యే సెకండ్ హాఫ్ సినిమా స్థాయిని అమాంతం పెంచేస్తుందని టాక్. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసేలా ఉంటాయని సమాచారం.
అయ్యప్ప మాలధారణ ఎపిసోడ్: కథాగమనంలో వచ్చే అయ్యప్ప స్వామి నేపథ్యం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచిన భక్తి గీతం ‘మల్లెపూల పల్లకి’ వచ్చే సన్నివేశం థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రంలో రామ్ చరణ్ అతిథి పాత్రలో కనిపిస్తారంటూ గత కొన్ని రోజులుగా సాగిన ప్రచారానికి ఇప్పటికే తెరపడింది. ఇందులో చరణ్ ఎలాంటి రోల్ చేయడం లేదని ఆయన టీమ్ అధికారికంగా తేల్చిచెప్పింది. బలమైన భావోద్వేగాలు, రవితేజ అద్భుత ప్రదర్శన, శివ నిర్వాణ మార్క్ ఎమోషన్లతో రాబోతున్న ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద కుటుంబ ప్రేక్షకులను మెప్పించడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైంది.
