జనరిక్ మందులపై ట్రంప్ ‘సుంకాల షాక్’.. భారత ఫార్మా రంగానికి ముప్పు ఎంత?  

Telugu BOX Office

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఔషధ రంగంపై భారీ సుంకాల ప్రతిపాదనతో గ్లోబల్ ఫార్మా మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు మరియు అమెరికా ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తమ సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా వెల్లడించారు.

 ట్రంప్ ప్రణాళిక ఏంటి?

  • మొదటి రెండేళ్లు (ఆగస్టు 1, 2026 నుండి): జనరిక్ మందుల దిగుమతిపై సున్నా శాతం పన్ను విధానమే కొనసాగుతుంది.
  • ఆగస్టు 2028 నుండి: జనరిక్స్ దిగుమతులపై ఏకంగా 100% సుంకం విధిస్తారు.
  • ఆగస్టు 2029 నుండి: ఈ పన్నును ఏకంగా 200 శాతానికి పెంచనున్నారు.
  • ఆప్షన్: ఈ లోపే అమెరికాలోనే సొంతంగా ప్లాంట్లు, పరికరాలు ఏర్పాటు చేసుకుని ఔషధాలను స్థానికంగానే తయారు చేయాలని, లేనిపక్షంలో ఈ భారీ పన్నులు చెల్లించక తప్పదని ట్రంప్ స్పష్టం చేశారు.
  • మినహాయింపు: ఇప్పటికే పేటెంట్ పొందిన, బ్రాండెడ్ మరియు వినూత్న ఔషధాలకు ఈ పన్నుల నుంచి మినహాయింపు ఉంటుంది.

భారత ఫార్మా పరిశ్రమపై ప్రభావం ఎంత?

గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) నివేదిక ప్రకారం, 2025లో భారత్ చేసిన మొత్తం రూ.2.4 లక్షల కోట్ల ఔషధ ఎగుమతుల్లో.. ఒక్క అమెరికాకే దాదాపు రూ.93,000 కోట్లు (38%) విలువైన ఎగుమతులు జరిగాయి. అమెరికాలో వాడే దాదాపు 90% ప్రిస్క్రిప్షన్లలో ఉన్న బీపీ, మధుమేహం (డయాబెటిస్), క్యాన్సర్, మానసిక సమస్యలు, అంటువ్యాధుల వంటి కీలక జనరిక్ మందులు, యాంటీబయోటిక్స్ భారత కంపెనీల నుంచే సరఫరా అవుతున్నాయి. అమెరికాలో స్థానికంగా ప్లాంట్లు పెట్టాలంటే అధిక వ్యయం అవుతుంది. అలాగని భారత్ నుంచి ఎగుమతి చేస్తే భారీ పన్నుల భారం పడుతుంది. ఈ రెండింటిలో ఏది కలిసి వస్తుందో భారత కంపెనీలు బేరీజు వేసుకోవాల్సి ఉంది. అలాగే, ఈ మందుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల (API) కోసం చైనాపై ఆధారపడటాన్ని అమెరికా జాతీయ భద్రతా లోపంగా భావిస్తోంది.

చివరికి భారం అమెరికా వినియోగదారులదే!

ట్రంప్ సుంకాల విధానం వల్ల అమెరికాలోనే మందుల కొరత ఏర్పడి, ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • జెనరిక్ ఫార్మా సీఈఓ జాన్ మర్ఫీ స్పందన: పరిశ్రమ మనుగడ కోసం ప్రభుత్వాలతో కలిసి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు.
  • GTRI వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాస్తవ విశ్లేషణ: అమెరికాలోని బ్రాండెడ్ మందులతో పోలిస్తే భారతీయ జనరిక్ మందులు 7 నుండి 10 రెట్లు తక్కువ ధరకు లభిస్తాయి. కాబట్టి 100% సుంకం విధించినా మన మందులు అక్కడ పోటీని తట్టుకోగలవు. అయితే ఈ పన్నుల భారం అంతా చివరికి అమెరికా ఆరోగ్య సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీలు మరియు రోగులపైనే పడుతుంది.

 భారతీయ ఫార్మా కంపెనీలు కేవలం అమెరికా మార్కెట్‌పైనే పూర్తిగా ఆధారపడకుండా.. ఐరోపా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా వంటి ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Share This Article
Leave a Comment