వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటి ఐశ్వర్యా రాజేష్, కంటెంట్ ఉన్న కథలనే ఎంచుకుంటాడనే నమ్మకమున్న నటుడు తిరువీర్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘ఓ.. సుకుమారి’. సరికొత్త విలేజ్ డ్రామాగా ప్రమోట్ చేయబడిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ ఇద్దరు టాలెంటెడ్ నటీనటులు తమ వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించారు? ఈ సుకుమారి కథా కబుర్లు ఎలా ఉన్నాయో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథేంటంటే..
దామిని (ఐశ్వర్య రాజేష్) అనే పల్లెటూరి అమ్మాయికి ఒక వింత సమస్య ఉంటుంది. ఆమెను ఎవరు తాకినా లేదా ఆమె ఎవరినైనా ముట్టుకున్నా కరెంట్ షాక్ కొడుతుంది. తల్లి దుర్గ (రూపా లక్ష్మీ) మరణం తర్వాత దామినికి ఈ సమస్య మరింత జటిలమవుతుంది. ఈ విచిత్ర పరిస్థితిని ఊరి జనాలు భరించలేక, ఆమెకు ఎలాగైనా పెళ్లి చేసి ఊరి నుంచి పంపించేయాలని చంద్రయ్య (ఆనంద్)పై ఒత్తిడి తెస్తుంటారు.

మరోవైపు యాదగిరి (తిరువీర్) అనే ఒక పిసినారి యువకుడికి ఊరికి సర్పంచ్ అవ్వాలనే బలమైన కోరిక ఉంటుంది. అయితే, తన తాత పెట్టిన కండీషన్ ప్రకారం.. తాను పెళ్లి చేసుకుని ఒక వారసుడిని కంటేనే 80 ఎకరాల పొలం తన సొంతమవుతుందని యాదగిరికి తెలుస్తుంది. ఎలాగైనా ఆ ఆస్తిని దక్కించుకోవాలనే తొందరలో, దామినిని చూసి ఇష్టపడతాడు. ఊరి ప్రజలందరూ కలిసి దామినికి, యాదగిరికి పెళ్లి చేయాలని చూస్తారు. దామినికున్న షాక్ కొట్టే సమస్య గురించి తండ్రి చంద్రయ్య పెళ్లి సమయానికే యాదగిరికి చెప్పినా, అతను ఆ మాటలను అస్సలు పట్టించుకోడు. ఆ తర్వాత ఆ దంపతుల జీవితంలో ఎలాంటి మలుపులు తిరిగాయి? పేరుకే ఉమ్మడి కుటుంబంగా ఉంటూ గొడవలు పడే యాదగిరి ఫ్యామిలీని దామిని ఎలా మార్చింది? చివరకు ఆమె సమస్య ఎలా తీరిందనేదే మిగతా సినిమా.
విశ్లేషణ:
ఒక అమ్మాయిని ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టడం అనే పాయింట్ వినడానికి చాలా కొత్తగా, ఆసక్తికరంగా అనిపిస్తుంది. సినిమా ప్రారంభం, పాత్రల పరిచయం మరియు ప్రథమార్ధంలో వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుడిని కొంతవరకు అలరిస్తాయి. ముఖ్యంగా పెళ్లిచూపుల సీన్, ఊరి జనాల హడావిడి కాస్త అతిగా అనిపించినా నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ బ్లాక్ కూడా ద్వితీయార్థంపై ఒక మోస్తరు అంచనాలను పెంచుతుంది.
అయితే, ఫస్ట్ హాఫ్ అంతా వినోదాత్మకంగా సాగడంతో సెకండాఫ్ ఎమోషనల్‌గా హార్ట్ టచింగ్‌గా ఉంటుందని ఆశించే ప్రేక్షకుడికి తీవ్ర నిరాశే ఎదురవుతుంది. కథనంలో ఎక్కడా ఒక బలమైన భావోద్వేగ సన్నివేశం కనిపించదు. విడిపోయిన కుటుంబాన్ని హీరోయిన్ ఒక్కటి చేయడం, హీరో హీరోయిన్ల మధ్య దూరం పెరగడం వంటి సీన్లు పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. ప్రతి సన్నివేశం ప్రేక్షకుడు ముందే ఊహించేలా సాగడం సినిమాకు పెద్ద మైనస్.
కాగితం మీద భలే ఉందే అనుకున్న ఈ డిఫరెంట్ పాయింట్‌ను వెండితెరపై పూర్తిస్థాయిలో రక్తికట్టించడంలో నూతన దర్శకుడు తడబడ్డాడు. అటు పక్కా యాక్షన్ డ్రామాగానూ కాకుండా, ఇటు కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ సెంటిమెంట్‌గానూ కాకుండా కథను మధ్యలో వదిలేసినట్లు అనిపిస్తుంది. కథనంలో ఎన్నో లాజిక్స్ మిస్ అయ్యాయి. విలనిజం కూడా చాలా బలహీనంగా ఉంది. జీవన్ రెడ్డి, టెంపర్ వంశీ వంటి పాత్రలను కేవలం బిల్డప్‌లకే పరిమితం చేసేశారు. ఆమని, మురళీధర్ గౌడ్, ఆనంద్ వంటి అనుభవజ్ఞులైన నటీనటులు ఉన్నప్పటికీ ఎవరినీ సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోయారు.
నటీనటులు – సాంకేతిక విభాగం:
తిరువీర్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నప్పటికీ, ఎగ్జిక్యూషన్ లోపల వల్ల ఆయన కష్టం వృథా అవుతోందనే ఫీలింగ్ కలుగుతుంది. ఐశ్వర్యా రాజేష్ తన పాత్ర పరిధి మేర చక్కగా నటించినప్పటికీ ఈ సినిమాను ఒంటిచేత్తో కాపాడలేకపోయింది. సాంకేతికంగానూ ఈ చిత్రం చాలా సాదాసీదాగా ఉంది. విజువల్స్ యావరేజ్‌గా ఉండగా, పాటలు పెద్దగా రిజిస్టర్ కావు. ఒకటి రెండు చోట్ల మాటలు మెప్పిస్తాయి. ఎడిటింగ్, నిర్మాణ విలువలు అవుట్‌డేటెడ్ ఫీలింగ్‌ను కలిగిస్తాయి.
ముగింపు:
‘ఓ.. సుకుమారి’ ఎటువంటి కొత్తదనం లేని ఒక రొటీన్ తెలుగు విలేజ్ డ్రామా. కాన్సెప్ట్ పరంగా కొత్తగా అనిపించినా, కథనంలో పాత చింతకాయ పచ్చడి ఫార్ములాను వాడటంతో నిరసన కలిగిస్తుంది. థియేటర్లలో కంటే, భవిష్యత్తులో ఓటీటీలోకి వచ్చినప్పుడు ఖాళీగా ఉంటే అలా అలా స్కిప్ చేస్తూ కాసేపు నవ్వుకోవడానికి మాత్రమే ఈ చిత్రం పనికొస్తుంది.
రేటింగ్: 2.5 / 5
