సాధారణంగా తమ అభిమాన హీరో సినిమా వస్తోందంటేనే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ చేసే హంగామా, సందడి మామూలుగా ఉండదు. అలాంటిది ఒకే రోజు, ఒకే హీరో నటించిన రెండు భారీ సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగితే… ఊహించుకోవడానికే పూనకాలు వచ్చే ఈ అరుదైన అనుభూతిని టాలీవుడ్లో కేవలం నందమూరి బాలకృష్ణ అభిమానులు మాత్రమే సొంతం చేసుకున్నారు. తెలుగు సినీ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని, భవిష్యత్తులో కూడా తిరగరాయడం అసాధ్యమైన ఒక అద్భుతమైన రికార్డును బాలయ్య తన పేరిట లిఖించుకున్నారు.

1993 సెప్టెంబర్ 3… బాక్సాఫీస్ వద్ద నందమూరి హవా
1993 సెప్టెంబర్ 3వ తేదీన బాలకృష్ణ నటించిన “నిప్పురవ్వ”, “బంగారు బుల్లోడు” చిత్రాలు ఒకే రోజు థియేటర్లలోకి వచ్చాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల బాలకృష్ణ ఎంతో ధైర్యంతో తీసుకున్న ఈ డేరింగ్ స్టెప్ టాలీవుడ్లో ఒక సంచలనంగా మారింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఒకే రోజు విడుదలైన ఈ రెండు చిత్రాలు కూడా 100 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని హిస్టరీ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా రాజమండ్రి కేంద్రంగా ఈ రెండు సినిమాలు వంద రోజులు ప్రదర్శితమవ్వడం విశేషం.
నిప్పురవ్వ: అప్పట్లోనే భారీ బడ్జెట్ చిత్రం
బాలకృష్ణ స్వయంగా తన ‘యువరత్న ఆర్ట్స్’ పతాకంపై నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం “నిప్పురవ్వ”. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో, సింగరేణి బొగ్గు కార్మికుల సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ డ్రామాలో విజయశాంతి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రానికి బప్పీలహరి సంగీతం అందించగా, సూపర్ హిట్ అయిన ‘రండి కదిలి రండి’ సాంగ్‌ను రాజ్-కోటి స్వరపరిచారు. విశేషం ఏంటంటే, ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (BGM) అందించింది ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్. నిజానికి ఈ సినిమా ముందుగా రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ సమయంలో జరిగిన ఒక ప్రమాదం కారణంగా కొందరు కోర్టును ఆశ్రయించడంతో విడుదల వాయిదా పడింది.
కలెక్షన్ల వర్షం కురిపించిన ‘బంగారు బుల్లోడు’
కోర్టు క్లియరెన్స్ వచ్చి ‘నిప్పురవ్వ’ విడుదలకు సిద్ధమయ్యే సమయానికి, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన “బంగారు బుల్లోడు” కూడా రెడీ అయిపోయింది. జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్‌పై వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు అప్పట్లోనే రూ. 4 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు. రవీనా టాండన్, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ సమయంలో మార్కెట్లో ఇతర హీరోల సినిమాలు లేకపోవడంతో, రెండు సినిమాల నిర్మాతలు చర్చించుకుని ఒకే రోజున విడుదల చేశారు. కమర్షియల్ పరంగా ‘బంగారు బుల్లోడు’ భారీ విజయాన్ని అందుకోగా, ‘నిప్పురవ్వ’ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయినప్పటికీ, కమర్షియల్ ఫలితంతో సంబంధం లేకుండా ‘నిప్పురవ్వ’ కూడా థియేటర్లలో విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. రిలీజ్ విధానం మరియు థియేటర్ రన్ పూర్తిగా మారిపోయిన ప్రస్తుత రోజుల్లో ఒకే రోజు విడుదలైన ఒకే హీరోకి చెందిన రెండు సినిమాలు వంద రోజులు ఆడటం అనేది మళ్లీ ఎవరూ సాధించలేని ఒక అసాధ్యమైన రికార్డుగా మిగిలిపోయింది.
