నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన జానపద, చారిత్రిక చిత్రాలు ఉన్నాయి. ‘ఆదిత్య 369’లో శ్రీకృష్ణదేవరాయలుగా, ‘భైరవద్వీపం’లో జానపద వీరుడిగా ఆయన చూపించిన నటన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఆధునిక కాలంలోనూ జానపద చిత్రాలతో మెప్పించగల ఏకైక నటుడు బాలయ్యే అని ఇండస్ట్రీ నమ్మింది. ఈ క్రమంలోనే ఆయన నుంచి రావాల్సిన ఒక భారీ జానపద చిత్రం షూటింగ్ సగం పూర్తయ్యాక నిలిచిపోయింది. అదే ‘విక్రమసింహ భూపతి’. టాలీవుడ్ చరిత్రలోనే ఒక అసంపూర్ణ కలగా మిగిలిపోయిన ఈ సినిమా వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు ఉన్నాయి.

బాలకృష్ణకు, భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అధినేత ఎస్. గోపాల్ రెడ్డికి మధ్య ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది. “నేను బాలయ్య అభిమానిని” అని గోపాల్ రెడ్డి బహిరంగంగానే చెప్పుకునేవారు. వీరిద్దరి కాంబినేషన్‌లో దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన మంగమ్మగారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, మువ్వ గోపాలుడు, ముద్దుల మావయ్య వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఇలాంటి తిరుగులేని క్రేజీ కాంబినేషన్‌లో ఒక జానపద చిత్రం వస్తోందంటే అంచనాలు సహజంగానే తారాస్థాయికి చేరుకున్నాయి. దానికి తోడు ‘విక్రమసింహ భూపతి’ అనే పవర్‌ఫుల్ టైటిల్ ప్రకటించడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ ప్రతిష్టాత్మక చిత్ర ప్రారంభోత్సవం 2001 జనవరి 9న హైదరాబాద్‌లోని తెలుగు లలిత కళా వేదికపై వేలాది మంది అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సినిమాలో బాలకృష్ణ ‘విక్రమసింహ భూపతి’గా, అలాగే ఒక యుద్ధ వీరుడిగా ద్విపాత్రాభినయం చేయాల్సి ఉంది. హీరోయిన్లుగా రోజా, అంజలా జవేరి, పూజా బాత్రా ఎంపికవ్వగా.. నాజర్, శరత్ బాబు, విజయ్ చందర్, ఎల్.బి. శ్రీరామ్, కె.ఆర్. విజయ వంటి భారీ తారాగణాన్ని రంగంలోకి దించారు. నిర్మాత గోపాల్ రెడ్డి ఈ సినిమాను బడ్జెట్ పరిమితులు లేకుండా, అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని భావించారు.
సినిమా విజువల్స్ అద్భుతంగా రావడం కోసం చిత్ర యూనిట్ రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్లు వేసి కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించింది. సినిమాలో రెండు మేజర్ వార్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు. అందులో ఒకదానిని రాజస్థాన్‌లోని ఎడారుల్లో, మరొకటి అరకు లోయలో తీయాలని నిర్ణయించారు. ముఖ్యంగా అరకులో ప్లాన్ చేసిన ఇంటర్వెల్ ఫైట్ సీన్ అప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై ఎవరూ చూడని విధంగా డిజైన్ చేశారు. దీనికోసం వైజాగ్‌లోని కొండల మధ్య ఒక అద్భుతమైన రాజనగర్ సెట్‌ను కూడా నిర్మించారు. అలాగే రామోజీ ఫిలిం సిటీలోనే అతిపెద్ద ఫ్లోర్‌ను లీజుకు తీసుకుని మరో భారీ సెట్ రెడీ చేశారు.
అయితే ఇంతటి భారీ ప్రణాళికలు, అంచనాల మధ్య సాగుతున్న ఈ ప్రాజెక్ట్ అనూహ్యంగా షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. వైజాగ్‌లో వేసిన రాజనగర్ సెట్‌లో గానీ, ఫిలిం సిటీలోని పెద్ద ఫ్లోర్ సెట్‌లో గానీ ఒక్క రోజు కూడా షూటింగ్ జరగకుండానే సినిమా ఆగిపోవడం ట్రేడ్ వర్గాలను తీవ్ర షాక్‌కు గురిచేసింది. ఈ సినిమా నిలిచిపోవడం వెనుక ఇప్పటికీ రకరకాల ప్రచారాలు ఉన్నాయి. హీరో బాలకృష్ణకు, నిర్మాత గోపాల్ రెడ్డికి మధ్య కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు వచ్చాయని కొందరు అంటుంటే.. దర్శకుడు కోడి రామకృష్ణ మేకింగ్ శైలి లేదా కథా గమనంలో వచ్చిన మార్పుల వల్ల క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని మరికొందరు చెబుతారు. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటనేది చిత్ర యూనిట్ అధికారికంగా ఎప్పుడూ ప్రకటించకపోవడంతో అది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది.
ఈ కలల ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోవడం నిర్మాత ఎస్. గోపాల్ రెడ్డిని తీవ్రంగా కలచివేసింది. అంతటి భారీ సినిమాను పూర్తి చేయలేకపోయామనే బాధ ఆయనను మానసికంగా ఎంతో కుంగదీసింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి అప్పటి యంగ్ స్టార్ హీరోలు ఆయనకు డేట్స్ ఇచ్చి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ, ఆ ప్రాజెక్టులేవీ కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ ‘విక్రమసింహ భూపతి’ గనుక పూర్తి అయ్యి థియేటర్లలోకి వచ్చి ఉంటే, తెలుగు జానపద చిత్రాల చరిత్రలో, బాలకృష్ణ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోయేదనడంలో ఎలాంటి సందేహం లేదు.
