భారతీయ జ్యోతిష్యంలో గురుడు, శుక్రుడు అత్యంత శుభగ్రహాలుగా భావించబడతారు. వివాహాలు, శుభకార్యాలు, విద్య, ధనం వంటి అంశాలను ఇవే ప్రభావితం చేస్తాయి. అయితే ఈ గ్రహాలు తమ గమనంలో సూర్యునికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు కాంతి తగ్గిపోవడం వల్ల శక్తి నిలిచిపోతుంది. ఈ కాలాన్నే మౌఢ్యమి లేదా వాడుకలో “మూఢమి” అని అంటారు. శుభగ్రహాలు కాంతి కోల్పోయే సమయంలో శుభకార్యాలను ప్రారంభించడం మంచిది కాదనే నమ్మకంతో ఈ సమయంలో అన్ని మంగళకార్యాలు నిలిపివేస్తారు.

2024–2026 శుక్ర మౌఢ్యమి వ్యవధి
ఈ ఏడాది శుక్రుడు అస్తంగత స్థితికి చేరే కాలం 2024 నవంబర్ 26 నుంచి ప్రారంభమై 2026 ఫిబ్రవరి 17తో ముగుస్తుంది. మొత్తం 83 రోజులపాటు కొనసాగే ఈ స్థితి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి మాఘ బహుళ అమావాస్య వరకు కొనసాగుతుంది. అందువల్ల మాఘ మాసం వరకు వివాహాలు, గృహప్రవేశాలు, నూతన ఆరంభాలకు శుభ ముహూర్తాలు పూర్తిగా లేవన్న మాట.
మౌఢ్యమి ఎలా సంభవిస్తుంది?
గురుడు లేదా శుక్రుడు సూర్యునికి సమీప దూరంలో వచ్చినప్పుడు ఈ మౌఢ్యమి ఏర్పడుతుంది. సూర్యుని అపార కాంతి వల్ల ఆ గ్రహాలకు కనిపించే తేజస్సు తగ్గిపోతుంది. సూర్యునికి, గురుని మధ్య దూరం 11 డిగ్రీల లోపకు వస్తే, అలాగే సూర్యునికి శుక్రుని మధ్య దూరం 8–10 డిగ్రీల మధ్యకు వస్తే మౌఢ్యమి సంభవిస్తుంది. శాస్త్రపరంగా ఇది గ్రహాలు “అస్తమించాయి” అనే భావనను సూచిస్తుంది.
మౌఢ్యమి సమయంలో చేయరాని పనులు
శుక్ర–గురు మౌఢ్యమి సమయంలో కొన్ని పనులు పూర్తిగా నిషిద్ధం. ముఖ్యంగా వివాహాలు, పెళ్లిచూపులు, ఉపనయనం, నూతన గృహారంభం, గృహప్రవేశం, యజ్ఞాలు, దేవతా ప్రతిష్ఠలు, వధూప్రవేశం వంటి మంగళకార్యాలు ఈ సమయంలో చేయరాదు. అలాగే వాహనం కొనడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, బావులు–బోర్లు తవ్వడం కూడా శాస్త్రం ప్రకారం అనుకూలం కాదు. అపూర్వ తీర్థయాత్రలు, పెద్ద ప్రయాణాలు, చెవులు కుట్టించడం, చదువు ప్రారంభం వంటి కార్యక్రమాలను కూడా ఈ సమయంలో నిలిపేయాలని శాస్త్రం చెబుతోంది.
మౌఢ్యమి సమయంలో చేయవచ్చని శాస్త్రం చెప్పిన పనులు
జ్యోతిష్య గ్రంథాల ప్రామాణికమైన విశ్లేషణ ప్రకారం, నిత్య కర్మలు మరియు అనివార్య కర్మలకు మౌఢ్యమి దోషం వర్తించదు. రోజువారీ పూజలు, అభిషేకాలు, నిత్యారాధన, నవగ్రహ శాంతి, హోమాలు, జపాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయవచ్చు. సీమంతం, నామకరణం, అన్నప్రాశనం వంటి సంస్కారాలు కూడా ఈ సమయంలో అనుమతించబడ్డాయి. అలాగే పాత ఇంటి మరమ్మతులు, రీమోడలింగ్, కొత్త వస్త్రాలు ధరించడం, చాతుర్మాస్య వ్రతాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు కూడా మౌఢ్యమిలో చేయవచ్చు.
