టాలీవుడ్‌కి ఊపిరిలూదిన ‘సెప్టెంబర్’.. ఇప్పుడు కళ్లన్నీ ‘OG’ మీదే

Telugu BOX Office

తెలుగు సినిమా రంగానికి ఈ యేడాది సంక్రాంతి సీజన్ తర్వాత సరైన హిట్ ఒక్కటీ పడలేదు. ‘తండేల్, కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ వంటి మిడ్ రేంజ్ హీరోల సినిమాలు కాస్త ఆడినా బాక్సాఫీస్ దాహం మాత్రం తీర్చలేదు. ఈ మధ్యకాలంలో ఇతర భాషల నుంచి వచ్చిన ‘మహావతార్ నరసింహ’, ‘కొత్త లోక’ చిత్రాలు కాస్త ఫర్వాలేదనిపించాయి. ఇక సెప్టెంబర్ నెలలో తెలుగు స్ట్రయిట్ చిత్రాలు దుమ్మురేపడంతో టాలీవుడ్ ఊపిరి పోసుకుంటోంది. ఈటీవీ విన్ తో కలిసి దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మించిన ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts) సినిమా సెప్టెంబర్ 5న విడుదలైంది. ఈ సినిమా ఇప్పటి వరకూ వరల్డ్ వైడ్ రూ. 32.15 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని మేకర్స్ చెబుతున్నారు. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన ఈ సినిమాను సాయి మార్తాండ్ డైరెక్ట్ చేశాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ సాధించిన విజయం చిన్న చిత్రాల నిర్మాతలకు పెద్ద ఊరటను ఇచ్చింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన ‘కిష్కింధపురి’ (Kishkindha Puri) సినిమా, తేజ సజ్జా, రితికా నాయక్ జంటగా కార్తీక ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ‘మిరాయ్’  ఈ నెల 12న విడుదలయ్యాయి. ‘కిష్కింధపురి’ తొలిరోజు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా రెండో రోజు నుంచి దూసుకెళ్తోంది. ఇక ‘మిరాయ్’ తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తొలి మూడు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.81.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు మేకర్స్ అఫిషియల్‌గా ప్రకటించారు. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా ఇదేనని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు ‘మిరాయ్’కు ప్రధాన బలంగా మారారు. కుటుంబ సమేతంగా కలిసి చూసేలా ఉందని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ రకంగా సెప్టెంబర్ నెలలో వరుస విజయాలతో టాలీవుడ్ కు కొత్త ఊపు వచ్చింది.

ఈ శుక్రవారం వస్తున్న చిత్రాలలో ‘బ్యూటీ’ చిత్రానికి కూడా పాజిటివ్ బజ్ ఉంది. అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన ఈ సినిమాను జె.ఎస్.ఎస్. వర్థన్ డైరెక్ట్ చేశాడు. దీనికి కథ, స్క్రీన్ ప్లే ఆర్. వి. సుబ్రహ్మణ్యం అందించాడు. బేసికల్ గా ఇది లవ్ స్టోరీనే అయినా తల్లిదండ్రులతో కలిసి చూసేలా దీన్ని తెరకెక్కించామని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కూ మంచి స్పందన లభించింది. ఈ మూవీతో పాటే తమిళ అనువాద చిత్రం ‘భద్రకాళి’ కూడా 19న రాబోతోంది. ఇది విజయ్ ఆంటోనికి 25వ సినిమా. ఈ మూవీ మీద అతను భారీ ఆశలు పెట్టుకున్నాడు.

ఈ నెలాఖరులో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ పాన్ ఇండియా మూవీగా విడుదలకు సిద్థమవుతోంది. ఈ నెల 25న రాబోతున్న ఈ సినిమాకు విదేశాలలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. కొన్ని ఏరియాల్లో పాత రికార్డులను ఇప్పటికే ఈ సినిమా తిరగరాసింది. ‘హరిహర వీరమల్లు’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోని నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ అంతా ‘ఓజీ’ మీదనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగానే ఉంది. ‘ఓజీ’ కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంటే సెప్టెంబర్ మాసం ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమని కష్టాల నుండి గట్టెక్కించిన నెలగా మిగిలిపోతుందని ఫిల్మ్‌నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Share This Article
Leave a Comment