ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక పండగైన ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొని పుణ్యస్నానాలు చేసేందుకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది ప్రజలు తరలివస్తున్నారు. ముఖ్యంగా జనావాసాలకు దూరంగా హిమాలయాలు, అరణ్యాల్లో జీవించే అఘోరాలు కుంభమేళాకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొస్తున్నారు. దీంతో అఘోరాల జీవనశైలిపై అనేక కథనాలు వైరల్గా మారాయి.
సనాతన ధర్మంలో అఖారా సిద్ధాంతాలను అనేక మంది అనుసరిస్తారు. వారిలో ఈ అఘోరాలు కూడా ఒకరు. అఖారాలను విస్తృతంగా శైవ(శివుని అనుచరులు), వైష్ణవ (విష్ణువు భక్తులు), ఉదాసీన్గా విభజించారు. ఇక్కడ ప్రతి వర్గానికి వారి స్వంత నియమాలు, ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. ఈ అఖారాలలో కుంభమేళా సమయంలో వివిధ ఆచారాలు, ఊరేగింపులు జరుగుతాయి. ఇవి ఆకర్షణీయంగా నిలుస్తాయి. మనిషి జీవితానికి, అఘోరాల జీవితానికి చాలా తేడా ఉంది. వారి జీవనశైలి ఇలాగే ఉంటుందని చెప్పడానికి ఇంత వరకు సరైన సమాచారం ఎక్కడా దొరకలేదు .. అది కనుక్కోవడం చాలా కష్టం. అయితే, ఈ అఘోరాల గురించిన షాకింగ్ నిజాల సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం..
అఘోరాల జీవన శైలికి గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వీరంతా స్మశాన వాటికలు, గుహల్లో నివసిస్తారని చెబుతారు. భోజనం లేకుండా నిత్యం ధ్యానం చేస్తుంటారని చెబుతుంటారు. అఘోరాలు శైవ సంప్రదాయానికి చెందిన ఒక భాగం మాత్రమే. వీరు ఎప్పుడూ పరమ శివుణ్ణి ఆరాధిస్తుంటారు. వారి మూలాలు 17వ శతాబ్దానికి చెందిన గొప్ప సన్యాసి అయిన కినారం వరకు ఉన్నాయి. కినారంను అఘోరాలు భగవంతుని స్వరూపంగా భావించి పూజిస్తారు.
మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. ఈ అఘోరీలు స్మశాన వాటికల్లో నిద్రిస్తూ, అక్కడ దొరికిన మాంసాన్ని తింటూ, మద్యం సేవిస్తూ, మనుషుల పుర్రెలను ప్లేట్లుగా వాడుకుంటారు. దహన బూడిదను ఒంటికి పూసుకోవడం కూడా వారి ఆచారాలలో ఒకటి. అలాగే ఇంటి బాధ్యతలన్నిటి నుండి పూర్తిగా విముక్తి పొందుతారు. వారికీ కుటుంబం కూడా ఉండదు. వారు చనిపోయినప్పుడు దహన సంస్కారాలు ఏవి నిర్వహించరు. శవాన్ని నదిలో పడేస్తారు.
అఘోరాలు చేసే సాధనను మూడు రకాలుగా విభజించారు. శివ సాధన, శవ సాధన, మరియు స్మశాన సాధన. అనగా శివుని ముందు తపస్సు, శవం ముందు తపస్సు, స్మశానంలో తపస్సు. కుళ్ళిపోయిన మాంసం తినడం, నగ్నంగా తిరగడం, వంటి చర్యలు ద్వారా వారికి ఇతర ఐచ్చిక సుఖాల మీద వ్యామోహం లేదని బహిరంగ పరుస్తారు. మృతదేహం మీద ఒక కాలు మీద నిలబడి దైవ ప్రార్ధన చేస్తారని నమ్ముతారు. ఇక్కడ ప్రధాన ప్రేరణ పార్వతి శివుడిపై నిలబడి ఉంది అని భావించడమే. వారు చనిపోయిన శరీరాన్ని కూడా ప్రసాదంగా భావించి స్వీకరిస్తారు. శ్మశాన సాధనలో వారు సమాధి మీద ప్రార్ధనలు చేస్తారు. సమాధికి స్వీట్లు, గంగాజలాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. శవ సాధనలో మాంసాన్ని ప్రసాదంగా భావిస్తారు. మరో నమ్మకం ప్రకారం మృతదేహాల కోసం అఘోరా సాధువులు అన్వేషణ సాగిస్తుంటారు. చనిపోయి ఖననం చేయబడకపోయినా, లేదా మరుగునపడిపోయిన శవాలను సైతం సులభంగా కనుక్కోగల సామర్ధ్యం వీరికుంటుందట. మరొక నమ్మకం ప్రకారం వారు చనిపోయిన వారితో సైతం అఘోరాలు మాట్లాడతారట.