ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమమైన ‘మహాకుంభ మేళా’ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఘనంగా జరుగుతోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజులపాటు నిర్వహించనున్న ఈ మహోన్నత కార్యక్రమంలో కోట్లాదిమంది భక్తులు పాల్గొంటున్నారు. సాధారణ ప్రజలతో పాటు సాధువులు, అఘోరీలు, ముఖ్యంగా నాగసాధువులు ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళా సమయంలో ఇక్కడ పుణ్య స్నానాలు చేస్తే జన్మ పునీతమవుతుందని భక్తుల నమ్మకం.
మహాకుంభమేళాకి సంబంధించి అమృత స్నానం చాలా ప్రత్యేకమైనది. అమృత స్నానాన్ని ఆచరించడం వల్ల భక్తుల పాపాలు నశించి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఈ అమృత స్నానం ప్రజలను ఆధ్యాత్మిక విముక్తికి దగ్గర చేస్తుంది. అమృత స్నాన సమయంలో గ్రహాలు, నక్షత్రాల ప్రత్యేక స్థానం కారణంగా నీరు అద్భుతంగా, దైవంగా మారుతుందని నమ్ముతారు. అమృత స్నానం పవిత్రమైన రోజులలో జరుగుతుంది.
అమృత స్నానం ఎప్పుడు చేస్తారు?
ఇప్పటికే జనవరి 14న తొలి అమృత స్నానం పూర్తికాగా.. జనవరి 29న జరిగే రెండో అమృతస్నానం వంతు వచ్చింది. దీని తరువాత మూడో అమృత స్నాన్ ఫిబ్రవరి 3న జరుగుతుంది. దీని తరువాత ఫిబ్రవరి 12న మాఘి పూర్ణిమ స్నానం, మహాశివరాత్రి రోజు (ఫిబ్రవరి 26)న ఆఖరి అమృత స్నానం జరుగుతుంది. అమృత ముహూర్తంలో అంటే ఉదయం 5:25 నుండి 6:18 వరకు స్నానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. విజయ ముహూర్తంలో మధ్యాహ్నం 2:22 నుండి 3:05 వరకు స్నానానికి రెండవ శుభ సమయం. సాయంత్రం 5:55 నుండి 6:22 వరకు సంధ్య ముహూర్తంలో స్నానానికి అనుకూల సమయం. అమృత్ స్నాన్ సమయంలో సబ్బు, షాంపూ ఉపయోగించరు. స్నానానంతరం అన్నదానం, ధనం, వస్త్రదానం చేయడం సముచితం. ఈ కాలంలో దీపాలను దానం చేయడం కూడా ముఖ్యం.
హిందూ మతంలో మహా కుంభమేళాకు భిన్నమైన ప్రాముఖ్యత ఉంది. కారణం ఏమిటంటే ఇది 12 సంవత్సరాల తర్వాత వస్తుంది. అంతేకాకుండా దేశంలో ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్, ప్రయాగ్‌రాజ్‌లతో సహా 4 ప్రదేశాలలో మాత్రమే మహా కుంభమేళా జరుగుతుంది. నాగ సాధువుల మొదటి స్నానం మతం, ఆధ్యాత్మిక శక్తికి కేంద్రంగా పరిగణించబడుతుంది. అమృత స్నాన్‌లో ముందుగా 13 అఖాడాల నుంచి నాగులు, సాధువులు, ఆచార్యులు, మహామండలేశ్వరులు, స్త్రీ నాగ సాధువులు స్నానం చేస్తారు. ఆ తరువాత భక్తుల వంతు వస్తుంది. కుంభమేళా సంప్రదాయం ప్రకారం, అమృత స్నానం ప్రత్యేక తేదీలలో మాత్రమే జరుగుతుంది.
సాధువులు, సన్యాసులు ఎందుకు వస్తారు..?
ఈ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి సాధువులు ఈ మహాకుంభానికి చేరుకుని పవిత్ర నదిలో స్నానం చేస్తారు. మత విశ్వాసం ప్రకారం మహా కుంభమేళాలో అమృత స్నాన్ (రాజ స్నానం) చేయడం వల్ల మోక్షం లభించి శరీరం మనస్సులో మలినాలు తొలగిపోతాయని భావిస్తారు. గ్రంథాల ప్రకారం మహా కుంభమేళాలో ఋషులు, సన్యాసులకు ఈ స్నానం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అమృత స్నానం చేయడం ద్వారా వెయ్యి అశ్వమేధ యాగాలకు సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. మహా కుంభమేళాలో అమృత స్నానం చేసిన తర్వాత, ఋషులు, సాధువులు భగవంతుడిని ధ్యానిస్తారు. ఈ కారణంగానే సాధువులు, ఋషులు లోక సంక్షేమం, మోక్షం కోసం మహా కుంభమేళాకు వస్తారు.