చేసేది సేల్స్‌మేన్ ఉద్యోగమే అయినా, అతని కలలు ఖండాలు దాటాయి. ఆ కలల్లోని సంకల్ప బలమే, మహ్మద్ ఎహియాని ప్రపంచం మెచ్చిన వ్యాపారవేత్తని చేసింది. పదోతరగతి కూడా చదవని అతను 25 దేశాలకు చెందిన 12వేలమందికి కొలువులిచ్చాడు. పూలసాగులో అద్భుతాలు చేస్తూ, గులాబీ ఎగుమతుల్లో ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా తన సంస్థని తీర్చిదిద్దాడు. భారీ ఉష్ణోగ్రతలతో భగభగమండే అరబ్ దేశాల్లో పూలని అప్పుడే కోసినంత తాజాగా తెచ్చి అమ్మడం అంటే ఎంత పెద్ద సవాల్ చెప్పండి. 30 ఏళ్ల క్రితమే ఇప్పుడున్న ఆధునిక సదుపాయాలేమీ లేని రోజుల్లోనే మహ్మద్ ఎహియా ఈ కలకి ప్రాణం పోశాడు. ‘నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు?’ అన్నంత ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశాడు.
తమిళనాడులోని తిరువయ్యారు దగ్గరున్న నడుక్కడై ఎహియా సొంతూరు. నలుగురు అన్నదమ్ముల్లో రెండోవాడు. పెద్ద చదువులు చదవడం కన్నా, ఏదో ఒక పనిలో చేరితే జీవితంలో త్వరగా కుదురుకోవచ్చు అనుకున్నాడు. దాంతో పదో తరగతిలోనే చదువు ఆపేసి తన తండ్రి పనిచేస్తున్న మలేషియా వెళ్లాడు. కానీ, పెద్దగా చదువుకోని కారణంగా చిన్నాచితకా ఉద్యోగాలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. మరికాస్త మంచి జీతం దొరుకుతుందేమోనని తన పెద్దన్నయ్య బషీర్ అహ్మద్ పనిచేస్తున్న దుబాయ్ వెళ్లాడు. బషీర్ అక్కడ ఓ పూల దుకాణంలో సేల్స్ మేనేజర్‌గా పనిచేసేవాడు. ఎహియా కూడా అక్కడే సేల్స్‌మేన్‌గా చేరాడు. అతని చదువుకి అంతకంటే గొప్ప ఉద్యోగం రాదుమరి. కానీ ఆ చిన్న ఉద్యోగంలో కూడా వీలైనంతగా వ్యాపార మెలకువలు నేర్చుకున్నాడు. ఎనిమిదేళ్ల తర్వాత తను దాచుకున్న డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారం మొదలుపెడదామన్న ఆలోచన వచ్చింది అతనికి. అదే విషయం తన అన్నయ్యతోనూ చెప్పాడు. అతనూ ధైర్యం ఇవ్వడంతో… తనకు అనుభవం ఉన్న పూల వ్యాపారంలోనే అడుగుపెట్టాడు.
అప్పటివరకు దాచుకున్న లక్షన్నర రూపాయల్ని పెట్టుబడిగా పెట్టి దుబాయ్‌లోనే ఓ చిన్నదుకాణం ప్రారంభించాడు. అప్పుడప్పుడే దుబాయ్‌లో పర్యటకుల రాక పెరుగుతోంది. దాంతో త్రీస్టార్, ఫైవ్‌స్టార్ హోటళ్లకీ డిమాండ్ పెరుగుతోంది. ఎహియా ఆ హోటళ్లకి వెళ్లి అక్కడ అలంకరణ కోసం, పెళ్లి వేడుకల్లో ఏ పూలు ఎక్కువగా వాడతారో అడిగి తెలుసుకొనేవాడు. చిన్నాచితకా ఆర్డర్లు సంపాదించేవాడు. డిమాండ్ ఉన్న గులాబీలూ, లిల్లీలను మలేషియా నుంచి తెప్పించి హోటళ్లకి అమ్మేవాడు. కానీ ఎంత వ్యాపారం చేసినా, ఆ లాభమంతా ఏజెంట్లకీ, వాళ్ల కమిషన్లకే సరిపోయేది. దాంతో తనే స్వయంగా మలేషియా వెళ్లి నేరుగా అక్కడి రైతుల నుంచి పూలను కొని తెచ్చుకోవడం మొదలుపెట్టాడు. కాస్త పర్వాలేదు అనుకొనే సమయానికి గల్ఫ్‌లో యుద్ధం మొదలైంది. దాంతో విమానాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, పూలు వారం రోజుల కంటే నిల్వ ఉండవు కదా. మరోవైపు పూల రైతులకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వక తప్పేది కాదు. అలా ఎన్నోసార్లు నష్టాన్ని భరించాల్సి వచ్చింది. ఆ నష్టాలనే పాఠాలుగా భావించాడు ఎహియా.
రైతుల నుంచి కొనడం కాకుండా, తనే స్వయంగా పూల సాగు చేయాలనుకున్నాడు ఎహియా. ప్రపంచ దేశాల్లో పూలసాగుకి అనుకూలమైన ప్రాంతం కెన్యా. దాంతో అక్కడికే వెళ్లి, రెండొందల ఎకరాల భూమిని లీజుకి తీసుకుని సాగు మొదలుపెట్టాడు. సొంత సాగు కాబట్టి కాస్తలో కాస్తయినా మిగిలేది. అలా 90వ దశకంలో చిన్న పూల దుకాణం కాస్తా ‘బ్లాక్ టులిప్ ఫ్లవర్స్’ సంస్థగా మారింది. దుబాయ్‌లో జరిగే సెలబ్రిటీ పెళ్లిళ్లకూ, హోటళ్ల అలంకరణకూ కావాల్సిన గులాబీ, లిల్లీ, ఆర్కిడ్, హైడ్రేంజా, టులిప్ పూలకోసం ఆర్డర్లు వచ్చేవి. క్రమంగా వ్యాపారమూ విస్తరించింది.
ప్రస్తుతం బ్రిటన్, నెదర్లాండ్స్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జపాన్, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా సహా 45 దేశాలకు తమ పూలను ఎగుమతిని చేస్తున్నట్లు చెబుతున్నారు ఎహియా. 300 రకాల సరికొత్త పూలని సాగుచేస్తూ ఏటా రూ.1400 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ సెలబ్రిటీ వివాహం జరిగినా ఈ సంస్థ నుంచి పూలు వెళ్లాల్సిందే. గులాబీ పూల ఎగుమతుల్లో ఈ సంస్థ ప్రపంచంలోనే నంబర్ స్థానంలో ఉంది. 25 దేశాలకు చెందిన 14వేలమంది ఉపాధి పొందుతున్నారు. సంస్థకొచ్చే లాభాల్లో పదిశాతం రైతుల బాగుకోసమే వినియోగిస్తున్నారు. అలాగే తను చదువుకున్న స్కూల్‌ని బాగుచేయించడంతో పాటూ ఎన్నో ధార్మిక కార్యక్రమాలనీ నిర్వహిస్తున్నారు ఎహియా.