Game Changer Review : ‘గేమ్ ఛేంజర్’ రివ్యూ..

Telugu BOX Office
Highlights
‘గేమ్ ఛేంజర్’ మూవీ రివ్యూ
Game Changer Telugu movie review 3

Game Changer Review|| చిత్రం: గేమ్‌ ఛేంజర్‌; నటీనటులు: రామ్‌చరణ్‌, కియారా అడ్వాణీ, అంజలి, ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, జయరామ్‌, నవీన్‌ చంద్ర, వెన్నెల కిషోర్‌, బ్రహ్మానందం, రాజీవ్‌ కనకాల తదితరులు; సంగీతం: తమన్‌; సినిమాటోగ్రఫీ: తిరు; ఎడిటింగ్‌: సమీర్‌ మహ్మద్‌, రుబెన్‌; కథ: కార్తిక్‌ సుబ్బరాజ్‌; నిర్మాత: దిల్‌రాజు; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్‌.శంకర్‌; విడుదల: 10-01-2025 (Game Changer Release Date)

భారీ బడ్జెట్ సినిమాల‌కి పెట్టింది పేరైన త‌మిళ ద‌ర్శకుడు శంక‌ర్ తెలుగులో తీసిన తొలి చిత్రం ‘గేమ్ ఛేంజర్’. గ్లోబర్ స్టార్ రామ్‌‌చరణ్ హీరో కావడంతో ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఐదేళ్ల త‌ర్వాత వ‌స్తున్న రామ్‌చ‌ర‌ణ్ సోలో చిత్రం ఇదే కావ‌డం… అగ్ర ద‌ర్శకుడు శంక‌ర్ తెర‌కెక్కించ‌డం, దిల్‌రాజు భారీ నిర్మాణ వ్యయంతో రూపొందించ‌డంతో ఈ సినిమా ప్రేక్షకుల్లో మ‌రింత ఆస‌క్తిని పెంచింది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌, పాటలు ఆ అంచనాలను మరింత పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘గేమ్‌ ఛేంజర్‌’పై మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. మ‌రి ఈ సినిమా ఆ అంచ‌నాలు అందుకుందా.. ప్రేక్షకులను మెప్పించిందా.. రివ్యూలో తెలుసుకుందాం…

కథేంటి..
ఒక నిజాయితీ గల ఐఏఎస్ అధికారికి, అవినీతిపరుడైన మంత్రికి మధ్య జరిగే పోరాటమే ‘గేమ్ ఛేంజర్’. ఒక ఐఏఎస్ అధికారి.. తన అధికారాన్ని ఉపయోగించి రాజకీయ వ్యవస్థను ఏవిధంగా ప్రభావితం చేశాడు.. సొసైటీలో ఎలాంటి మార్పులు తీసుకుని వచ్చాడనేదే గేమ్ ఛేంజర్ అసలు కథ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్)తో గేమ్ ఛేంజర్ కథ మొదలౌతుంది. అడ్డదారిలో సీఎం అయ్యి.. అవినీతికి అడ్రస్‌గా మారిన సత్యమూర్తిలో పశ్చాత్తాపం కలుగుతుంది. తన పదవీకాలం చివరి ఏడాదిలో రాష్ట్రంలో ఎలాంటి అవినీతి ఉండకూడదని నిశ్చియించుకుంటాడు. అయితే అతడితో మంత్రివర్గంలో ఉన్న కొడుకులు మోపిదేవి (ఎస్.జే సూర్య), రామచంద్రరెడ్డి (జయరాం)లు విభేదిస్తారు. చివరికి తండ్రినే చంపేసి.. సీఎం కావాలని అనుకుంటాడు మోపిదేవి. ఆ తరుణంలో సొంత ఊరు వైజాగ్‌కి కలెక్టర్‌గా అడుగుపెడతాడు రామ్ నందన్ (రామ్ చరణ్). బాధ్యతలు చేపట్టగానే అవినీతిపరులపై ఉక్కుపాదం మోపుతూ మోపిదేవి ఆట కట్టిస్తాడు. అదే సమయంలో ఎవరూ ఊహించని విధంగా రామ్‌ నందన్‌ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తాడు సత్యమూర్తి. అసలు రామ్ నందన్ ఎవరు?.. అతని గతం ఏంటి?.. అతడిని ఎందుకు సత్యమూర్తి సీఎంగా ప్రకటించాడు?.. అప్పన్న (రామ్ చరణ్)కి రామ్ నందన్‌కి ఉన్న రిలేషన్ ఏంటి అన్నదే అసలు కథ.

ఎలా ఉంది..
ఒకేఒక్కడు, భారతీయుడు, శివాజీ తదితర సినిమాల్లో చూపించినట్లుగానే అవినీతి, వ్యవస్థ ప్రక్షాళన వంటి అంశాల చుట్టూ తిరిగే కథ ఇది. ఓ యంగ్ ఐఏఎస్ అధికారికి, రాజ‌కీయ నాయ‌కుడికీ మ‌ధ్య సాగే ఓ యుద్ధం. అక్కడ‌క్కడా శంకర్‌ మార్క్ విజువ‌ల్స్, అప్పన్న ఎపిసోడ్, కొన్ని మెరుపులు మిన‌హా క‌థ‌నం, భావోద్వేగాల ప‌రంగా పెద్దగా మ‌న‌సుల్ని తాకలేదనే చెప్పొచ్చు. వాస్తవికత‌తో కూడిన సినిమాల్ని ఇష్టప‌డుతున్న ఈ తరానికి వాళ్లకు ఇదివ‌ర‌కెప్పుడూ తెర‌పై చూడ‌ని కొత్త ప్రపంచాన్నైనా చూపించాలి. లేదంటే, వాస్తవానికి ద‌గ్గర‌గా అనిపించే క‌థ‌నైనా అందించాలి. (Game Changer Review Telugu) శంకర్ ‘గేమ్ ఛేంజర్’ మాత్రం ఈ రెండింటికీ కాస్త దూరంగానే సాగింది. రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికల సంఘం చుట్టూ జరిగే కొన్ని సంఘటలన సమాహారంగానే ఈ సినిమా సాగుతుంది.

శంకర్ సోషల్ మెసేజ్‌తో అన్ని సినిమాల్లోనూ బలమైన ప్లాష్‌బ్యాక్ ఉంటుంది. అదే సినిమాకి కొండంత బలం. అదే ఫార్ములాను ఫాలో అవుతూ ‘గేమ్ ఛేంజర్’లోనూ ఓ ఫ్లాష్ బ్యాక్ క్రియేట్ చేశారు. ఈ సినిమాకు కూడా అదే కీలకంగా మారింది. అప్పన్నగా రామ్ చరణ్ పంచెకట్టు క్యారెక్టర్ ‘గేమ్ ఛేంజర్‌కి సోల్ ఆఫ్ ది మూవీ. ఫస్టాఫ్‌లో వ‌చ్చిన ఫ్లాష్‌బ్యాక్ ఫర్వాలేదనిపించినా, సెకండాఫ్‌లో వచ్చే అప్పన్న ఎపిసోడ్‌లో మాత్రం శంకర్‌ టేకింగ్‌, మేకింగ్‌ ఆకట్టుకుంటుంది. అప్పన్న పోరాటం, రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టడం, ఆ క్రమంలో త‌న‌కు ఎదుర‌య్యే స‌వాళ్ల నేప‌థ్యంలో మంచి డ్రామా పండింది. ఓ గొప్ప సందేశాన్ని ఇస్తూ.. అంతకంటే గొప్పగా ఎమోషనల్ కనెక్టివిటీతో అద్భుతంగా సినిమా తీయడంలో శంకర్ నేర్పరి. గత కొన్నాళ్లుగా ఆ మార్క్‌ని మిస్ అవుతున్న శంకర్.. ‘గేమ్ ఛేంజర్’ బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నంలో సగం మాత్రమే సక్సెస్ అయ్యారు.

ఎవరెలా చేశారంటే..
యాంగ్రీ యంగ్‌మ్యాన్‌లా, అప్పన్నలా, ఐఏఎస్‌లా రామ్‌చరణ్ మూడు కోణాల్లో సాగే పాత్రలో తెరపై సందడి చేశాడు. అన్ని పాత్రల్లో ఆయన లుక్ అదిరిపోయింది. హీరోయిన్ కియారా అడ్వాణీకి క్యారెక్టర్‌ పరంగా అంత స్కోప్ లేకపోయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె అందం ఈ సినిమాకి ప్లస్ అయింది. ఇక పాటల్లో గ్లామర్‌తో పాటు డ్యాన్సుల్లోనూ చెర్రీతో పోటీపడింది. తెలుగమ్మాయి అంజలికి ప్రాధాన్యమున్న పాత్ర దొరికింది. అమె రెండు రకాల లుక్స్‌లో కనిపిస్తుంది. మినిస్టర్ మోపిదేవిగా ఎస్.జె.సూర్య నటన ఈ సినిమాకి హైలెట్‌గా నిలిచింది. హుషారైన నటనత విలనిజం పండిస్తూనే అక్కడక్కడా నవ్వులు పూయించాడు. కొన్ని సీన్లలో అయితే రామ్‌చరణ్‌ని డామినేట్ చేశాడనే చెప్పాలి. జ‌యరాం, స‌ముద్రఖ‌ని, రాజీవ్ క‌న‌కాల ప్రాధాన్యమున్న పాత్రల్లో క‌నిపించారు. నిర్మాత దిల్‌ రాజు పెట్టిన ఖర్చంతా తెరపై కనిపించింది.

‘గేమ్ ఛేంజర్’ మూవీ రివ్యూ
Game Changer Telugu movie review 3
Criteria 3 out of 5
Share This Article
Leave a review