రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ రూపొందుతున్న చిత్రం ‘కల్కి 2898 AD’. పీరియాడిక్ కథాంశం, భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రిలీజ్ ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. అన్ని సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీగా ఉంది.
మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని థియేటర్లలో ఈ శుక్రవారం ‘కల్కి’ భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ముఖ్యంగా నైజాంకి హార్ట్ లాంటి హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ AMB లో 40 షోలు, PRASAD లో 32 షోలు AAA లో 40 షోలు ప్లాన్ చేశారు. మొత్తం మీద భాగ్యనగరంలోని అన్ని థియేటర్లలో ‘కల్కి’ చిత్ర ప్రదర్శనకు సన్నాహాలు చేస్తున్నారు. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు టికెట్ రేట్లు, అదనపు షోలకు అనుమతి ఇవ్వగా ఏపీ జీవో విడుదల కావాల్సి ఉంది. ఇక మొదటి రోజు ఈ చిత్రం 200 కోట్లు కొల్లగొడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా టికెట్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. బుక్ మై షో లాంటి సంస్థలు టికెట్స్ ను ఆన్లైన్ లో విడుదల చేయగా నిమిషాల వ్యవధిలో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఎటు చూసిన ‘కల్కి’ ఫీవర్ తో ఫాన్స్ హంగామా చేస్తున్నారు. దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి ఉదయం ఐదు షోలు పడుతున్నాయి. ఒకరకంగా సంక్రాంతి తరువాత స్టార్ హీరోల సినిమాలు రాకపోవడంతో బాక్సాఫీస్ కళ తప్పింది. చిన్నసినిమాలు వచ్చినవి వచ్చినట్టే ప్లాప్ అవడంతో కొన్ని రోజులు థియేటర్లు మూసివేసిన సంగతి విదితమే. తెలుగులో సాలిడ్ హిట్ అయిన టిల్లు స్క్వేర్ వచ్చి మూడు నెలలు దాటేసింది.
‘కల్కి’తో మూతపడిన థియేటర్ల బూజు దులిపి కలెక్షన్ల సునామి సృష్టించాలని సినిమా హాల్స్ యజమానులు ఆశగా చూస్తున్నారు. అటు బాక్సాఫీస్ వర్గాలు కూడా ‘కల్కి’ కలెక్షన్స్ పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. టిక్కెట్ల రేట్లు పెంపు, అదనపు షోలు, భారీ హైప్, సోలో రిలీజ్ తో ఒక్క హైదరాబాద్ లోనే తొలిరోజు ఈ చిత్రం 20 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. భారీ హంగులతో, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో విడుదల అవుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు, ఉలగనాయగన్ కమల్ హాసన్, బిగ్ బీ అమితాబ్ నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ దీపిక, దిశా పటానీ సహా మాళవిక నాయర్ వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్న చిత్రానికి భారీ బడ్జెట్ చిత్రాలు అశ్వినీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.