మంత్రివర్గంలోకి లోకేష్.. చంద్రబాబు ఫిక్స్ అయినట్లేనా!

Telugu BOX Office

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నెల 11న టీడీఎల్పీ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు కేబినెట్ కూర్పు.. ఆంధ్రప్రదేశ్ నూతన ఐటీశాఖ మంత్రి ఎవరనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పలువురి పేర్లు వినిపించాయి. అయితే మంత్రివర్గ కూర్పుకు కొంత సమయం పడుతుందంటున్నా.. తాజాగా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. దీంతో కొత్త ఐటీశాఖ మంత్రి ఎవరో క్లారిటీ ఇచ్చేసినట్లేనా అంటూ చర్చ జరుగుతోంది.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన నారా లోకేష్‌‌ కేబినెట్‌లో చేరే అంశంపై క్లారిటీ లేదు. గతంలో లోకేష్ తాను మంత్రివర్గంలోకి వెళ్లనని.. తనకు వేరే పనులు ఉన్నాయని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తాను మంత్రివర్గంలో చేరడం కన్నా పార్టీపరంగా బాధ్యతలు తీసుకుంటానని చెప్పిన సంగతి తెలసిందే. తాజాగా ఓట్ల లెక్కింపు తర్వాత.. కేబినెట్‌లో చేరడంపై మీడియా ప్రతినిధులు క్లారిటీ అడిగారు. తనకు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని చెప్పారు.

అయితే లోకేష్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడంపై తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. లోకేష్‌ను రాష్ట్ర మంత్రివర్గంలో చేరనున్నారని.. ఆయనకు ప్రాధాన్యమున్న మంత్రిత్వశాఖల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని.. ఈ మేరకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలోకి రాకుండా బయట ఉంటే కీలక విధాన నిర్ణయాలు, వాటి అమల్లో భాగస్వామ్యం ఉండదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. 2014 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎమ్మెల్సీ పదవితో పాటుగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఐటీ, పంచాయతీరాజ్ శాఖల బాధ్యతల్ని నిర్వహించారు. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఓటమి తర్వాత మంగళగిరిలో తరచూ పర్యటిస్తూ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు.. తన సొంత నిధులతో నియోకవర్గంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2024 ఎన్నికల్లో మళ్లీ మంగళగిరి నుంచి పోటీచేసి.. ఏకంగా 91413 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం, మంగళగిరి, విజయవాడలో ఐటీ కంపెనీలు తీసుకురావడంలో లోకేష్ కీలకపాత్ర పోషించారు. అలాగే నరేగా, తదితర శాఖల నిధులతో గ్రామాల్లో పాతిక వేల కిలోమీటర్లకుపైగా పొడవైన రోడ్ల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. దీంతో ఈసారి కూడా లోకేష్‌కు ఐటీశాఖ బాధ్యతలు అప్పగించడం ఖాయమనే చర్చ జరుగుతోంది.

Share This Article
Leave a comment